ఒకే సమస్యపై పరస్పర పోరాటం
అధికారికి అండగా ఒకరు... వ్యతిరేకంగా మరొకరు
గందరగోళంగా అధికారపార్టీ నేతల వైఖరి
కడప: ఒకరేమో అవినీతికి అడ్డుకట్ట వేయండి.., అక్రమంగా తిన్న సొమ్మును కక్కించండి అంటూ ఆందోళన చేస్తారు. మరొకరేమో అదే అధికారికి అండగా నిలుస్తారు... ఇలా పరస్పర విరుద్ధ వైఖరితో అధికార పార్టీ నాయకులు అయోమయం సృష్టిస్తున్నారు. వీరి తీరు ఉద్యోగుల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఐసీడీఎస్‌శాఖ అధికారిణి విషయంలో పులివెందుల తెలుగుతమ్ముళ్లు ప్రవ ర్తిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిణిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయండంటూ పులివెందులలో ఐదు రోజులుగా అంగన్‌వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నా యంత్రాంగంలో చలనం లేకుంది. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్లు ఆమెకు మద్దతుగా ఒకరు, వ్యతిరేకంగా మరొకరు ఉండడమే అధికారుల మౌనానికి
కారణంగా తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన సీడీపీఓ ...
ఐసీడీఎస్ పులివెందుల సీడీపీఓ సావిత్రి ఇటీవల వార్తల్లోని వ్యక్తి అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పులివెందుల ఐసీడీఎస్‌లో భారీ అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని టీడీపీ నేత రాంగోపాల్‌రెడ్డి ఆరోపణలు సంధించారు. నిబంధనలకు విరుద్ధంగా 50 రోజులు సెంటర్లను మూత వేయించారు. ఆ సమయంలో పిల్లల పిండిని బొక్కేశారని, దీనిపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారం అటుండగానే సీడీపీఓ అన్యాయం చేసిందంటూ అంగన్‌వాడీ వర్కర్లు ధర్నాకు ఉపక్రమించారు. వారికి 13నెలలుగా బిల్లులు అందకపోవడం అందుకు కారణమైంది. నిబంధనల మేరకు విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ)కు మాత్రమే నిధులు మంజూరు చేయాలి, వారి నుంచే అంగన్‌వాడీ వర్కర్లు డ్రా చేసుకోవాలి అని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను మూత వేయకుండా సొంత ఖర్చులతో నడపండి, తర్వాత బిల్లులు ఇస్తామని ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న వర్కర్ల ప్రశ్నలకు జవాబు చెప్పే అధికారి లేరు. టీడీపీ నేత రాంగోపాల్‌రెడ్డి ఆరోపణలకు బలం చేకూరేలా అంగన్‌వాడీ వర్కర్లు ఆధారాలు చూపారనే కక్షతో వేధింపులకు గురి చేస్తున్నట్లు వర్కర్లు భావిస్తున్నారు.
తెరవెనుక అభయంతోనే....
ఐసీడీఎస్ సీడీపీఓ సావిత్రిపై ఆరోపణలు చేస్తూ అంగన్‌వాడీ వర్కర్లు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత చేసిన ఆరోపణల మేరకూ సుమారు రూ.10లక్షలు పిల్లల సొమ్ము స్వాహాకు గురైనట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అయినా సీడీపీఓపై కనీస చర్యలు లేకున్నాయి. అందుకు కారణం అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడేనని పులివెందుల నియోజకవర్గంలో ఏ నోట చూసినా వినిపిస్తోంది. అయినా ఆయనలో మార్పు కన్పించడం లేదు. టీడీపీలోని వర్గవిభేదాలు అందుకు కారణంగా నిలుస్తున్నాయి.
ఒకరు ఫిర్యాదు చేస్తే, మరొకరు అండగా నిలుస్తున్న వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎవరైనా అవినీతిని ప్రోత్సహించడం సహేతుకం కాదని విశ్లేషకులు భావన. వందలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు ఆవేదనకు అండగా నిలవాల్సిన యంత్రాంగం, ఆ దిశగా చర్యలు లేకుండా పోయాయి. అధికార పార్టీకి చెందిన ప్రధాన నేత ఆగ్రహానికి గురి కాకుడదనే భావన మెండుగా యంత్రాంగంలో ఉండడమే అందుకు కారణం. ఇప్పటికైన బాధ్యత కల్గిన యంత్రాంగం వాస్తవ పరిస్థితుల్ని వర్కర్లుకు వివరించి, వారికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది.
ట్రాన్సుఫర్‌కు సిఫార్సులు చేశాం...: ఆర్డీ శారదమ్మ
పులివెందుల సీడీపీఓ అవినీతికి పాల్పడిందని అప్పటి ప్రాజెక్టు డెరైక్టర్ నివేదించారు. తమ పరిధిలో ప్రాథమిక విచారణ చేస్తున్నాం. వెంటనే ట్రాన్సుఫర్ చేయాలని తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాం. చర్యలు తీసుకోవడంలో జాప్యం అవుతోంది. వారం రోజుల్లో సీడీపీఓ సావిత్రిని బదిలీ చేస్తాం. వర్కర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు, వారంద రికి న్యాయం చేస్తామని ఐసీడిఎస్ రీజనల్ డెరైక్టర్ శారదమ్మ సాక్షి ప్రతినిధికి వివరించారు.
తమ్ముళ్ల జగడం..
Published Tue, Feb 10 2015 2:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement