తిరుపతిలో కీలకమైన సర్కిల్‌లో పోస్టింగ్ కోసం నలుగురు సీఐలు పోటీ పడ్డారు. పోటీ అధికమవడంతో ఎవరు ఎక్కువ డబ్బు ముట్టజెబితే వారికి పోస్టింగ్ ఇప్పిస్తానని ఓ ప్రజాప్రతినిధి తెగేసి చెప్పారు. ఆ సీఐల సూచన మేరకే సదరు ప్రజాప్రతినిధి వేలంపాట పెట్టారు.
రూ.25 లక్షలకు పాడిన ఓ సీఐ ఆ పోస్టింగ్‌ను కొనుక్కున్నారనే అంశంపై పోలీసువర్గాల్లోరసవత్తరమైన చర్చ సాగుతోంది. పోలీసు బదిలీల్లో టీడీపీ నేతలు ప్రదర్శిస్తోన్న చేతివాటానికి ఇదో తార్కాణం. పోలీసుశాఖే కాదు, కీలకమైన శాఖల్లో పోస్టింగ్ కోసం ఆశ్రయిస్తోన్న వారి నుంచి టీడీపీ నేతలు భారీ ఎత్తున గుంజుతోండడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారంలో ఉండగానే కోట్లకు పడగలెత్తాలన్న లక్ష్యంతో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచోవడానికి అధికార నేతలు అంగీకరించడం లేదు. చివరకు అధికారుల బదిలీలనూ అక్రమార్జనకు అనువుగా మల్చుకుంటున్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు చేసిన దిశానిర్దేశాన్ని పెట్టుబడిగా పెడుతోండటం గమనార్హం.
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులకు ప్రతి రెండేళ్లు లేదా మూడేళ్లకు ఒకసారి స్థానభ్రంశం కల్పించడమన్నది సాధారణం. కౌన్సెలింగ్‌ల ద్వారా, సీనియారిటీ, సమర్థత, నిజాయితీ ఆధారంగానూ బదిలీలు చేస్తారు. నిజాయితీ, నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులను కీలక ప్రదేశాల్లో నియమించి, వారి సేవలు వినియోగించుకోవడం పరిపాటి.
తద్వారా అధికారగణంలో విశ్వాసాన్ని నింపవచ్చునన్నది ప్రభుత్వ భావన. కానీ ఇప్పుడు ఆ విధానానికి సీఎం చంద్రబాబు వక్రభాష్యం చెబుతున్నారు. టీడీపీకి దన్నుగా నిలిచే కార్యకర్తలు చెప్పినట్టల్లా తలాడించే అధికారులను ఏరికోరి నియమించుకోవడం వల్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సీఎం మార్గదర్శకాల మేరకు తమ నియోజకవర్గం, మండలం పరిధిలో ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నది శాఖలవారీగా టీడీపీ నేతలు ఆయా శాఖల ఉన్నతాధికారులకు జాబితా అందిస్తున్నారు. ఆ జాబితా ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నారని అధికారవర్గాలు స్పష్టీకరిస్తోండటం అందుకు నిదర్శనం. పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, నీటిపారుదల, విద్యాశాఖకే టీడీపీ నేతలు పరిమితం కాలేదు.
చివరకు పోలీసుశాఖను కూడా విడిచిపెట్టడం లేదు. తమ నియోజకవర్గంలో ఎవరు డీఎస్పీగా పనిచేయాలి, ఎవరు సీఐగా విధులు నిర్వహించాలి, ఎవరు ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించాలి అన్న అంశాన్ని ఆ నియోజకవర్గాల నేతలే నిర్ణయించి, అదే జాబితాను పోలీసు ఉన్నతాధికారులకు అందించి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారు.
ఇది పసిగట్టిన అధికశాతం మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలు అడిగింది ముట్టజెప్పి పోస్టింగ్‌లు దక్కించుకునేలా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ నేతల చేతులు తడపలేని నిజాయితీపరులైన అధికారులకు పోస్టింగ్‌లు దక్కక వీఆర్ (వెకెన్సీ రిజర్వు)లోకి వెళ్లాల్సిన దుస్థితి దాపురించందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముడపులు ముట్టజెప్పి పోస్టింగ్‌లు దక్కించుకున్న అధికారులు నిజాయితీతో విధులను నిర్వర్తించలేరని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.
పోస్టింగ్ కోసం తాను పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి అక్రమాలకు పాల్పడాల్సిన పరిస్థితిని అధికారపార్టీ నేతలే కల్పిస్తున్నారనే భావన బలంగా వ్యక్తమవుతోంది. అధికారపార్టీ నేతల ప్రతిపాదన మేరకు పోస్టింగ్‌లు పొందిన అధికారులు విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితే ఉండదని, పక్షపాతంగానే పనిచేయాల్సి వస్తుందని అధికారవర్గాలు వాపోతున్నాయి.
పైసామే పోస్టింగ్
Published Tue, Nov 25 2014 1:37 AM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM
Advertisement