సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల దోపిడీకి గుడి, బడి ఏదీ తేడా లేకుండా పోతోంది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌కు సమీపంలో శుక్రవారం జరిగిన పేలుడు సంఘటన చుట్టూ పరిణామాలను గమనిస్తే మరిన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఈ పేలుడు ప్రాంతానికి సమీపంలోనే సోమేశ్వర ఆలయం ఉంది. కొండపై ఉన్న ఈ ఆలయం చుట్టూ ఉన్న కొండను సైతం పేలుస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. క్వారీ లీజు తీసుకున్న ప్రాంతానికి దూరంగా గుడి చుట్టూ ఉన్న రాయిని డిటోనేటర్లతో పగలగొడుతున్నారు. అలాగే గుడిచుట్టూ అధికారపార్టీ నేతలు గుంతలు వేస్తున్నారు. తీసుకున్న లీజు ప్రాంతం కొంత మేర ఉంటే.. అంతా తమదే అన్నట్టు సోమేశ్వర ఆలయం చుట్టూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుండడాన్ని అక్కడి ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారులు మాత్రం కనీసం అటువైపుగా కన్నెత్తి చూడటం లేదు. పైగా మైనింగ్ అధికారులు కొందరు.. ఈ అధికారపార్టీ నేతకు చెందిన మైనింగ్ ప్రాంతంలోనే కొద్దిరోజుల క్రితం భారీగా ‘పార్టీ’ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పేలుళ్లకు పాల్పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అధికారపార్టీ ఒత్తిళ్లతో పాటు భారీగా మామూళ్లు ముడుతుండటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గుడి చుట్టూ గుంతలు
గుప్తనిధుల కోసం జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో పీర్ల గుడికి సమీపంలో నేరుగా ప్రభుత్వమే తవ్వకాలు చేపట్టింది. నెలల తరబడి ఈ తంతు సాగుతోంది. ఎక్కడ కనబడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. కనీసం పురావస్తు శాఖ నుంచి అనుమతి కూడా లేదు. కేవలం కలెక్టర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ తతంగం సాగుతోంది. ఇప్పుడు అధికారపార్టీ నేతలు కూడా ఆలూరు మండలం హత్తిబెళగల్‌కు సమీపంలో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయం చుట్టూ తవ్వకాలు చేపట్టారు. క్వారీ కోసం లీజుకు తీసుకున్న భూమితో సంబంధం లేకుండా ఈ తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు (ఈడీ) పెట్టి గుడిచుట్టూ ఉన్న బండలను పేల్చేశారు.
ఆలయం కింద నుంచి ఆలయానికి వెళ్లే మార్గం వరకూ అనధికారికంగా తవ్వకాలు చేశారు. హత్తిబెళగల్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అక్రమ పేలుళ్లపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. శుక్రవారం జరిగిన పేలుడు సంఘటన కూడా ఆలయానికి సమీపంలోనే చోటుచేసుకుంది. ఈ ఆలయానికి ప్రతి సోమవారం, అలాగే పౌర్ణమి, అమావాస్య రోజున చుట్టుపక్కల నుంచి భారీగా జనం వస్తుంటారు. రాత్రి సమయాల్లో గుడి సమీపంలోనే 100 మంది వరకూ నిద్రిస్తుంటారు. ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత వెళ్లడం ఆనవాయితీ. ఒకవేళ శుక్రవారం రాత్రి జరిగిన పేలుడు కాస్తా సోమవారం జరిగి ఉంటే మా పరిస్థితి ఏమిటంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊహించుకుని భీతిల్లుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment