
ఓటమి భయంతో టీడీపీ నేతలు అక్కడే!
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీలో ఓటమి భయం తారాస్థాయికి చేరింది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీలో ఓటమి భయం తారాస్థాయికి చేరింది. నంద్యాల ఓటర్లు ఒక్కొక్కరి చేతిలో డబ్బులుపెట్టి ఓటేయాలంటూ దేవుడి బొమ్మ మీద ప్రమాణం చేయిస్తున్నా.. వారి భవిష్యత్తు కళ్లకు కనిపిస్తుండటంతో పచ్చ నేతలు నంద్యాలను వీడటం లేదు. మరోవైపు నేటితో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నంద్యాలోనే తిష్టవేశారు.
కర్నూలు జిల్లాను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశించినా నంద్యాలలోనే పాగా వేసిన టీడీపీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. గుంటూరు, కృష్ణా సహా ఇతర జిల్లాల నుంచి టీడీపీ నేతలు నంద్యాలకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. నంద్యాల హోటళ్లు, లాడ్జీలు మొత్తం టీడీపీ నేతలతో నిండిపోయాయి. ఇతర జిల్లాల మంత్రులు సైతం నంద్యాలలోనే మంత్రాంగం నడుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరగదంటూ టీడీపీ నేతలు ఓటర్లను భయాందోళలనకు గురిచేస్తున్నారు. టీడీపీ నేతల చర్యలను వైఎస్ఆర్‌సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు ఇదివరకే అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ 23న నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.