
బీజేపీపై టీడీపీ ఎదురుదాడి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన సీమాంధ్ర బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
- బీజేపీ స్థానాల్లోంచి ఉపసంహరించుకోని టీడీపీ అభ్యర్థులు
- బలహీన అభ్యర్థులంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం
- టీ డీపీపై బీజేపీ నేతల ఆగ్రహ జ్వాలలు
- రెండు పార్టీలకూ ఓటమి తప్పదంటున్న విశ్లేషకులు
సాక్షి,విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన సీమాంధ్ర బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన కడప, సంతనూతలంపాడు, గుంతకల్లు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఉపసంహరింపచేయాలని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోకుండా నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఇప్పుడు తమ మాట పట్టించుకోవడం లేదని చెప్పడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా చంద్రబాబు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారనే భావన బీజేపీ నేతల్లో ఉంది. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు చంద్రబాబు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులపై కంటి తుపుడు చర్యగా చర్యలు తీసుకున్నా, ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు ఏ మాత్రం
ఉపయోగ పడే అవకాశం లేదు.
బలహీన అభ్యర్ధులపై దుమారం....
‘బీజేపీ బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టిందంటూ’ చంద్రబాబు గతంలో చేసిన ప్రకటన పై రెండుపార్టీల్లోనూ దుమారం లేపుతోంది. బీజేపీ అభ్యర్థులు ఓడిపోతే.. మేము ముందే చెప్పాం అంటూ చంద్రబాబు యాగీ చేస్తారనే భయం నేతల్లో ఉంది. టీడీపీ పోటీ చేసే స్థానాలన్నింటిలోనూ బలమైన అభ్యర్థుల్నే నిలబెడితే 160కు పైగా స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రకటన బీజేపీ అభ్యర్థుల ఆత్మస్ధైరాన్ని నైతికంగా దెబ్బతీయడమేనని అంటున్నారు.
టీడీపీ ఎదురుదాడి..
పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ నేతలు ఇప్పుడు తాము వెన్నుపోటు పోడవలేదంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ బీజేపీకి కేటాయించిన కడప,సంతనూతలంపాడు, గుంతకల్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇస్తామని బీజేపీ నేతలకు ముందుగానే చెప్పామని బుకాయించారు. ముందు బీఫారాలు ఇస్తామని, తరువాత అవసరమైతే ఉపసంహరింప చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు అభ్యర్థులు ఉపసంహరించుకోకపోవడం చంద్రబాబు తప్పేమీ కాదంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ స్థానాల్లో పోటీ చే స్తున్న టీడీపీ అభ్యర్ధులపై ఎప్పటిలోగా క్రమశిక్షణా చర్యలుతీసుకుంటారో కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు.
ఇదే విషయం పై శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ములశ్యామ్ కిశోర్, సీమాంధ్ర ఉద్యమ కన్వీనర్ యు.శ్రీనివాసరాజులు మాట్లాడుతూ తమకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులకు బీఫారాలు ఇస్తామన్న విషయం తమకు ముందు చెప్పామన్న టీడీపీ నేతల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుజనా చౌదరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు.
రెండు పార్టీలకు ఓటమి తప్పదా!
బీజేపీకి కేటాయించే స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టడం వల్ల అక్కడ అటు బీజేపీ,ఇటు టీడీపీలు రెండూ నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమకు జరిగిన నష్టంపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థులు ఓడించడానికి వెనుకాడరని ఆ పార్టీ నేతలు అంటున్నారు.