సాక్షి, ముద్దనూరు: టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రచ్చ రచ్చ చేసిన వైనమిది. బస్సెక్కి మెట్లపై నిలబడిన తనను లోపలికి రమ్మని పిలిచినందుకు ఆగ్రహించి.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక తన బంధువులను రప్పించి బస్సు డ్రైవర్‌ను తమ వాహనంలో బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది.
ఎమ్మెల్సీ బీటెక్ రవికి చెందిన సమీప బంధువు చంద్రశేఖరరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి పులివెందులకొస్తున్న ఓవీఆర్ ట్రావెల్స్ బస్సు ఎక్కి మెట్లపై నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు ప్రమాదం జరిగే వీలుందంటూ క్లీనర్ ఆయన్ను లోపలికి రమ్మని పిలిచాడు. దీంతో ఆగ్రహించిన సదరు ఎమ్మెల్సీ బంధువు క్లీనర్‌పై పరుషపదజాలంతో వాగ్వాదానికి దిగడమేగాక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో తీవ్రంగా భయపడిన క్లీనర్ బస్సు కర్నూలుకు రాగానే దిగి వెళ్లిపోయాడు. ఈలోగా చంద్రశేఖరరెడ్డి సమాచారమివ్వడంతో అతని బంధువులు స్కార్పియో వాహనంలో వచ్చి.. బస్సు ముద్దనూరు సమీపంలోకి రాగానే అడ్డుకున్నారు.
స్కార్పియోలో ఉన్న సునీల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రఫీలతోపాటు చంద్రశేఖరరెడ్డిలు బస్ డ్రైవర్ శ్రీనివాసులును బలవంతంగా దించేసి.. వాహనంలో తమ వెంట తీసుకుపోయారు. వాహనం సింహాద్రిపురం సమీపంలోకి రాగానే శ్రీనివాసులు కేకలేయడంతో అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే డ్రైవర్ ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు చంద్రశేఖరరెడ్డితోపాటు సునీల్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రఫీలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment