తెలుగువాడిని చంపుతానన్న సందీప్ దీక్షిత్కు తెలంగాణ ఎంపీలు ఎలా మద్దతు ఇస్తారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : తెలుగువాడిని చంపుతానన్న సందీప్ దీక్షిత్కు తెలంగాణ ఎంపీలు ఎలా మద్దతు ఇస్తారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఉదయం ఓ ఛానల్స్ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రసాద్ ....కాంగ్రెస్ నేతలు లోపలొకటి.... బయటొకటీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచేందుకే చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయటం తగదని ఆయన సూచించారు.
ఇందిరాగాంధీ మాస్క్ ధరించి నిరసనకు దిగిన ఎంపీ శివప్రసాద్ వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఎలా దిగుతావో చూస్తానని దుర్భాషలాడుతూ బెదరింపులకు పాల్పడ్డాడని టీడీపీ నేతలు కూడా ఆరోపించగా, తెలుగు జాతిని అవమానపరిచే విధంగా సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేశాడని, తెలుగు వారంటే కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి చులకన భావం ఉందని ఆపార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సందీప్ దీక్షిత్ దూషణలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు కూడా.
ఇక శివప్రసాద్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. శివప్రసాద్ సభలో వ్యవహరించిన తీరును సీడీలతో సహా బయటపెడతామని అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రసక్తే లేదని గుత్తా స్పష్టం చేశారు.