నయవంచన రాజకీయాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
నయవంచన రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం తిరుపతిలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి తెలుగువారికి బాబు ద్రోహం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే మరోసారి ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాసి ప్రజలను వంచించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అవలంభించిన నిరంకుశ వైఖరికి నిరసనగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బాసటగా నిలుస్తున్నారని కరుణాకర్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలు సమన్యాయం కావాలని కోరుకుంటున్నారని అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.