టీడీపీ నుంచి మరో నేత సస్పెన్షన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డిపై వేటు వేశారు. ఆయనపై మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఇటీవల జయచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై జేసీకి క్షమాపణ చెప్పాలని పార్టీ ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. తాను చేసిన ఆరోపణలను కట్టుబడి క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో టీడీపీ ఆయనపై చర్య తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను వదిలేసి కౌన్సిలర్‌ను సస్పెండ్ చేయడాన్ని తాడిపత్రి ప్రజలు తప్పుబడుతున్నారు.
భూకబ్జా కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో జేసీ అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని టీడీపీ ఇటీవల బహిష్కరించింది. బ్యాంకులకు డబ్బులు ఎగవేశారని ఆరోపణలు రావడంతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని అంతకుముందు టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు.