పుష్కర సన్నాహాలకు కోడ్ సంకటం!
సాక్షి, రాజమండ్రి :ఇప్పటికే నత్తకన్నా మందకొడిగా సాగుతున్న పుష్కరాల పనులకు కొత్త గా ఎన్నికల కోడ్ సంకటం ఎదురయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో బుధవారం నుంచే కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో రెండు జిల్లాల్లో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు ఉండదు. కాగా జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు జిల్లాలో సుమా రు రూ.400 కోట్లకు పైగా వెచ్చించి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ ఇంకా వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఎలా ముందుకు సాగించాలన్న సందిగ్ధం వివిధ శాఖల్లో ఏర్పడింది. కోడ్ కారణంగా ఈ పనులు నిలిచి పోయే అవకాశం ఉంది.
కాగా ఈ కోడ్ పుష్కర పనులకు వర్తిస్తుందా, లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కోడ్ అనేది అన్నింటికీ సమం గా వర్తిస్తుందని మరికొందరు చెబుతున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ రూ.240 కోట్లతో పుష్కర పనులు చేపడుతోంది. ఇవి ఇంకా టెండర్ల స్థాయిలోనే ఉన్నాయి. ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. నీటిపారుదల శాఖ కొన్ని పనులను మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఆ శాఖ మొత్తం రూ.42 కోట్లతో చేపట్టనున్న 164 పనుల్లో సుమారు 130 పనులకు టెండర్లు పూర్తి చేసింది. ఆ పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దేవాదాయ శాఖ కూడా రూ.14 కోట్ల మేర పనులు ఇంకా పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్‌అండ్‌బీ శాఖ రూ.87.55 కోట్లతో 175 పనులు చేపడుతుండగా వీటిలో 70 పనుల వరకూ టెండర్లు పిలిచారు. ఇంకా పంచాయతీరాజ్, పర్యాటక శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలకు నిధులు విడుదల కావాల్సి ఉంది.
కోడ్ ఉంటే మరో నెల ఆలస్యం..
ఎన్నికల కోడ్ పుష్కర పనులపై ప్రభావం చూపితే మరో నెల రోజులు పనులకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 16న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 19న చేపడతారు. అంత వరకూ కోడ్ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ టెండర్లు పిలవని పనులకు కూడా ఆ తర్వాతే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఏ పనులు చేపట్టాలి, ఏ పనులు కోడ్ పరిధిలోకి వస్తాయి అనే అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. తాము కలెక్టర్ ద్వారా ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని పుష్కరాల ప్రత్యేకాధికారి జె.మురళి అంటున్నారు.
ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తాం..
పుష్కర పనులకు ఎన్నికల కోడ్ వర్తింపు విషయంలో ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తాం. రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్‌కు ఈ మేరకు లేఖ రాస్తున్నాం. ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఉత్సవాలు. వీటిని కోడ్ నుంచి మినహాయించమని కోరతాం. పుష్కరాలు కేవలం ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే ఉంటాయి. అవి కూడా దాని కోసం నిర్దేశించిన పనులు మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ పనులను కోడ్ నుంచి మినహాయించాలి.
- జె.మురళి, పుష్కరాల ప్రత్యేకాధికారి