సాక్షి, రాజమండ్రి :జనంలో జగనోత్సాహం ఉప్పొంగింది. గోదావరి ప్రవాహం జనంగా మారి వీధుల్లో పారిందా అనిపించింది. తమ ప్రియతమ నేతను అడుగు ముందుకు వేయనీయలేదు. రాజమండ్రిలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన జనభేరి ఓ ప్రభంజనం అయింది. జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రి వచ్చిన జగన్ తన రెండవ రోజు పర్యటనలో భాగంగా కార్పొరేషన్‌లోని పలు డివిజన్‌లను కలుపుకుంటూ పర్యటించారు. పాత సోమాలమ్మ గుడి వీధిలోని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కార్యాలయం నుంచి బొమ్మూరు వరకూ రోడ్ షో నిర్వహించారు.
పోటెత్తిన జనవాహిని
జనవాహిని పోటెత్తడంతో ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో రాత్రి 7.15 గంటల వరకూ కొనసాగింది. పది కిలోమీటర్ల రోడ్‌షోలో ఏ ప్రాంతంలోను ఏ ఒక్కరినీ విస్మరించకుండా జనం మధ్యకు వెళ్లి వారి అభిమానాన్ని చూరగొన్నారు.
మరో రెండు నెలల్లో మంచి రోజులు
జనం బాధల్ని తెలుసుకుంటూ, వారిని ఓదారుస్తూ మంచికాలం ముందుందని జగన్ ధైర్యం చెప్పారు. మరో రెండు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, మీరంతా పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిస్తూ ఈ జైత్రయాత్ర నగరవీధుల గుండా సాగించారు.
రోడ్ షో సాగిందిలా
ఉదయం 11.00 గంటలకు పాత సోమాలమ్మ గుడి వద్ద ఉన్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కార్యాలయం నుంచి బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. తమ సమస్యలు ఆలకించాలంటూ జనం అడ్డుపడుతూ జగన్ వాహనాన్ని ముందుకు సాగనివ్వలేదు.
11.10 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డుకు రోడ్‌షో చేరుకుంది. అక్కడ పెద్దఎత్తున మహిళలు జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకునేందుకు పోటీపడ్డారు. గోరక్షణపేట మలుపు వద్దకు చేరుకోగానే వందలాది మంది మహిళలు వచ్చి జగన్‌ను కలిసి తమ జీవితాలకు ఎదురవుతున్న కష్టాలను విన్నవించారు. ఎక్కడికక్కడ యువకులు, మహిళలు జగన్ వాహనాన్ని నిలువరిస్తూ, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మహానేత మరణానంతరం నాలుగేళ్లపాటు తాము పడ్డ కష్టాలను ఏకరువు పెట్టారు. అక్కడ నుంచి జగన్ హోటల్ షెల్టన్ సెంటర్ మీదుగా తాడితోట జంక్షన్‌కు చేరుకుని జనాన్ని ఆప్యాయంగా పలకరించారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు బైపాస్‌రోడ్డులోని 14, 15వ డివిజన్‌లలోని వాంబే గృహాల ప్రాంతానికి చేరుకున్నారు. ఆంధ్రానగర్ సిమ్మెట్రీపేట, శారదానగర్‌ల నుంచి మహిళలు చంటిపిల్లలను చంకనెత్తుకుని మరీ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. పసిపిల్లలను ముద్దాడుతూ, చెల్లెమ్మల తలనిమురుతూ, తల్లులకు నమస్కరిస్తూ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు జగన్. అక్కడ మహిళలకు మరో రెండు నెలల్లో మీ కష్టాలు తొలగిపోతాయంటూ ధైర్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని, మీరు కలలుగన్న రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో యువకులు జగన్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు.
జనభేరి యాత్ర మూడు సినిమాహాళ్ల సెంటర్‌కు 12.45కు చేరుకుంది. అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు.
మైనారిటీల ఆప్యాయతఅడుగడుగునా ఎదురవుతున్న అశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ ఆజాద్‌చౌక్ చేరుకున్నారు. అక్కడ వందలాదిగా ముస్లిం మైనార్టీ వర్గాలు జగన్‌ను కలిసి వారి సమస్యలను ఏకరువు పెట్టారు. ముందుగా గౌరవ సత్కారంగా జగన్ శిరస్సున టోపీ ధరింపచేసి మతపెద్దలు అభివాదం చేశారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న జగన్ తమ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. ముస్లిం యువకులు కాబోయే సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు.
ఆజాద్‌చౌక్ నుంచి జాంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి వరకూ జగన్ రోడ్‌షోకు జనం బ్రహ్మరథం పట్టారు. యువజన నాయకులు జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్‌లు యువకులతో వచ్చి జగన్‌ను కలిశారు. అనంతరం 1.35 గంటలకు జాంపేట మార్కెట్ మీదుగా చర్చిగేటుకు చేరుకున్న జగన్ ప్రతి ఒక్క అభిమానిని పలకరించుకుంటూ 2.20 గంటలకు శ్యామలాంబ అమ్మవారి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనం లోంచే మహిళలకు అభివాదం చేస్తూ భోజన విరామం కోసం ఎమ్మెల్యే సూర్యప్రకాశరావు ఇంటికి మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకున్నారు. భోజన విరామం అనంతరం 4.30 గంటలకు రౌతు ఇంటి నుంచి బయలుదేరిన రోడ్‌షో సాయికృష్ణా థియేటర్ సెంటర్, డీలక్స్ సెంటర్, శ్యామలా సెంటర్, కోటిపల్లి బస్టాండు మీదుగా సాగింది. రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ 5.00 గంటలకు గూడ్సు గేటు వద్దకు చేరుకునేసరికి పెద్దఎత్తున మహిళలు జగన్ కోసం ఎదురుచూస్తూ కనిపించారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ రైల్వేస్టేషన్ మీదుగా ఆల్కాట్‌గార్డెన్‌కు చేరుకున్నారు.
అధినేతకు ఆశీస్సులు
ఐఎల్‌టీడీ ఫ్లై ఓవర్ వద్ద చెల్లే మేరీ అనే మహిళ జగన్ శిరస్సుపై చేయి ఉంచి ప్రార్థన చేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలిగించి మరింత ఉత్తేజాన్ని ఇవ్వాలని ఏసుక్రీస్తును ప్రార్థించారు. సాయంత్రం 6.55 గంటలకు బాలాజీపేట సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకులవీర్రాజు ఆధ్వర్యంలో జనం ఫ్యాను గుర్తులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. రాత్రి 7.15 గంటలకు జగన్ బొమ్మూరుకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను అభివాదంతో పలకరించి అమలాపురం బయల్దేరి వెళ్లారు.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డిఅప్పారావు, బొడ్డుభాస్కరరామారావు, ఎమ్మెల్యే రౌతుసూర్యప్రకాశరావు, పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతులనెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరజాలవెంకటస్వామినాయుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు కొల్లినిర్మలాకుమారి, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బాబిరెడ్డి, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మనరాజ్‌కుమార్, పార్టీ రూరల్ కోఆర్డినేటర్ ఆకులవీర్రాజు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్‌లు కర్రిపాపారాయుడు, అనంత ఉదయభాస్కర్(బాబు), తాడి విజయభాస్కరరెడ్డి, గారపాటి ఆనంద్, గెడ్డం రమణ, జక్కంపూడిరాజా, రాజమండ్రి నగర పాలకసంస్థ పరిశీలకులు ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి, రావిపాటి రామచంద్రరావు, నక్కారాజబాబు, గుర్రంగౌతమ్ పాల్గొన్నారు.
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఏజెన్సీ ప్రాంత నేతలు
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ రంపచోడవరం కోఆర్డినేటర్ అనంతఉదయభాస్కర్(బాబు) ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. మంగళవారం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రి నగరంలో నిర్వహించిన రోడ్‌షోలో గోరక్షణపేట వద్ద గంగవరం మండలానికి చెందిన డీసీసీబీ డెరైక్టర్ వెజ్జువెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు నేతం సోమాయమ్మ, వోతాకొండమ్మ, దోలిపల్లిపాలురెడ్డి, సారాపునారాయణదొర, మాజీ సర్పంచ్ పెనుమర్తిరామిరెడ్డి, మొల్లేరు సొసైటీ ఉపాధ్యక్షుడు పల్లాల వీరభద్రారెడ్డి, డెరైక్టర్లు పి.నాగేశ్వరరావు, బొట్టావీరబాబు, కామేశ్వరరావు, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ శివాజీలు పార్టీలో చేరారు. వీరికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.