
ఎర్రబెల్లిని తిడితే నాలుక్కోస్తాం
టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్‌కు టీ కాంగ్రెస్ ఎంపీల హెచ్చరిక
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బాసటగా నిలిచారు. ఎర్రబెల్లిని తిడితే ఊరుకునేది లేదని, నాలుక కోస్తామని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్‌ను హెచ్చరించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు లేకపోతే తెలంగాణలో టీడీపీ పరిస్థితి జీరో అవుతుందని ఎద్దేవా చేశారు. శనివారం తన నివాసంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య మీడియాతో మాట్లాడారు.
‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలిపిన ఎర్రబెల్లికి అక్షరజ్ఞానం లేదని అంటావా? రాజకీయ విజ్ఞత లేని నీవు ఎంపీ సీటు సహా దేన్నైనా డబ్బుతో కొనుక్కోవచ్చనే విధంగా మాట్లాడుతావా? ఇంకోసారి ఇట్లాగే మాట్లాడితే నీ నాలుకకు ఉప్పు, పసుపు పెట్టి పలుచగా చేస్తాం’’అని హెచ్చరించారు.
టీడీపీలో ఉన్న తెలంగాణ నేతలకు చీమూ నెత్తురూ ఉంటే వెంటనే పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్ ఫొటోలు, ఫ్లెక్సీలను ఇకపై ఏ కార్యక్రమాలకూ తెలంగాణ నాయకులు ఉపయోగించవద్దని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర విభజనకు రాజ్యాంగంలో 371(డి) అధికరణ అడ్డంకి కాదని పేర్కొంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ కేంద్ర హోంమంత్రి షిండేకు పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.