
కేసీఆర్ వల్లే తెలంగాణ జాప్యం
తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు బాధ్యత వహించాలని తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
రాష్ట్రపతికి జగన్ అఫిడవిట్లు ఇవ్వడమేంటి?: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు బాధ్యత వహించాలని తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాట తప్పడం వల్లే రాష్ట్ర విభజన ఆలస్యమవుతోందని, శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలంగాణవాదం ముసుగులో కేసీఆర్ సమైక్యవాదం వినిపిస్తున్నారని, ఆయన తెలంగాణ ద్రోహి అని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రకటన చేసినపుడు కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ కూడా టీఆర్‌ఎస్ విలీనాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవాలనే ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్ తన పార్టీని విలీనం చేయడంలేదన్నారు. కేసీఆర్ మనసులో రాష్ర్టం సమైక్యంగా ఉండాలని, వైఎస్సార్‌సీపీ జగన్‌మోహన్‌రెడ్డి మదిలో వెంటనే విభజన జరగాలనే భావన ఉందన్నారు. రాష్ట్రపతిని కలిసి జగన్ అఫిడవిట్లు ఇవ్వడం ఏమిటని మోత్కుపల్లి ప్రశ్నించారు. తెలంగాణవాదుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.