తెలంగాణపై ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన ఒక్కో పార్టీ రంగులు ఇప్పుడు బయటపడుతున్నాయని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి అన్నారు.
నందిపేట న్యూస్‌లైన్ : తెలంగాణపై ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిన ఒక్కో పార్టీ రంగులు ఇప్పుడు బయటపడుతున్నాయని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకునేందుకు త్వరలోనే తుపాను వస్తుందంటూ కొందరు నాయకులు పగటి కలలు కంటున్నారని, ఏ తుపాన్ వచ్చినా అది టీ కప్పులోవచ్చే తుపానుతో సమానమన్నారు. మంగళవారం మండలంలోని వెల్మల్, కౌల్‌పూర్, కంఠం, అయిలాపూర్ గ్రామాలలో జరిగిన జండాపండుగ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సురేశ్‌రెడ్డి మాట్లాడారు. ఎటువంటి రాజకీయ ప్రయోజ నాలు ఆశించకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటుపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేం దుకే జండాపండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కౌల్‌పూర్ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పా టు చేయిస్తానని హామీనిచ్చారు. అయిలాపూర్‌లో మహిళా భవనం నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తాహెర్ మాట్లాడుతూ వాస్తవాలను ధైర్యంగా చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో బతికి ఉండగానే సమాధులు కట్టిన టీడీపీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.