సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తన మంత్రులనీ చూడకుండా, మహిళలన్న కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై జిల్లా భగ్గుమంది. అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ నినదించింది. ఢిల్లీలో బుధవారం సీఎం వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. మంత్రి గీతారెడ్డిపై జరిగిన దాడికి సీఎం బాధ్యత వహించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల పిలుపు మేరకు జిల్లాలో గురువారం ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీలతో పాటు ఎన్‌ఎస్‌యుఐల ఆధ్వర్యంలో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బోధన్ తదితర ప్రాంతాల్లో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకో, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్, పూలాంగ్ చౌరస్తాలలో కాంగ్రెస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్‌ల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్‌టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి, సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. పూలాంగ్ చౌరస్తాలో ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌కు పాలాభిషేకం చేశారు.
ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కిరణ్ కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్, డీసీసీ కార్యదర్శి దర్బాస్తు రాజశేఖర్, అర్గుల్ సురేష్, పీసీ భోజన్న, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ ఆర్మూర్ నియోజకవర్గం అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీలు నిర్వహించి, సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నందిపేటలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
బోధన్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీలో ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. స్థానిక ఏఎంసీ చైర్మన్ గంగాశంకర్, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడపల్లిలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం వైఖరిపై నాయకులు మండిపడ్డారు. నవీపేటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎంపీపీ సూరిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామారెడ్డిలో సీఎం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఏం దిష్టి బొమ్మను దహనం చేశారు. భిక్కనూరు మండలంలోను సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి, రాస్తారోకో చేశారు. దోమకొండ, బీబీపేట్‌లలో కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో, లింగంపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. డిచ్‌పల్లిలో సీఎం కిరణ్ తీరును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. సీఎం కిరణ్ తీరును నిరసిస్తూ ధర్పల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్ తీ రును నిరసిస్తూ ధర్పల్లిలో రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ వర్సిటీలక్ష ఏబీ వీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. జక్రాన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. వర్నిలో సీఎంకు వ్యతిరేకంగా రాస్తారోకో, గీతారెడ్డిపై దాడికి నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం పై ఫైర్
Published Fri, Feb 7 2014 1:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement