మందమర్రి రూర ల్/ నిర్మల్ (మామడ ), న్యూస్‌లైన్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన 3వ విడత రచ్చబండకు తెలంగాణ సెగ తగిలింది. కార్యక్రమ ప్రారంభానికి ముందే చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రమేశ్, కార్యదర్శి నూకల రమేశ్, నాయకులు సంగి సదానందం వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో సీఎం కిరణ్‌కుమార్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీని తొలంగించారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త వేదికపైనున్న ఫ్లెక్సీని ఎవ్వరికి అందకుండా పట్టుకొని పరుగులు తీశాడు.
చివరకు పోలీసులు ఆయన్ని వెంబడించి బ్యానర్‌ను వేదిక వద్దకు తీసుకువచ్చారు. దీంతో గొడవ ముదరడంతో ఫ్లెక్సీని చుట్ట చుట్టి పక్కన పెట్టారు. ఫ్లెక్సీలో ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ ఫొటో ఉండాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం బొమ్మ ఉన్న బ్యానర్‌ను తొలగించి వారు ప్రత్యేకంగా తయారు చేయించిన రచ్చబండ బ్యానర్‌ను వేదికపై తగిలించారు. తెలంగాణ ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఈ ప్రాంతంలో కనిపించవద్దని గుడ్ల రమేశ్ పేర్కొన్నారు.
మామడలోనూ సీఎం ఫొటో తొలగింపు..
మామడలో బుధవారం నిర్వహించిన రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉండడంతో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దానిని తొలగించాలని సూచించారు. దీంతో అక్కడున్న వారు ఫ్లెక్సీ తొలగించి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీని పెట్టారు.