ఔను.. వాళ్లిద్దరూ దోస్త్ అయ్యారు!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఎట్టకేలకు దోస్త్ అయ్యారు. సమైక్య, ప్రత్యేకవాదాలతో ఇద్దరి మధ్య ఏడాది కాలంగా వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతోపాటు దిష్టిబొమ్మలు సైతం దహనమయ్యాయి. తాజాగా ఆదివారం సంగారెడ్డిలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇద్దరు ఒక్కటై మాట్లాడు కోవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ‘సీఎం పర్యటనను అడ్డుకుంటాం.. ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ సవాలు, ప్రతి సవాలు విసురుకున్న వీరు కలిసిపోవడంతో చర్చనీయాంశమైంది.
ఇటీవల ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఏఐసీసీ ప్రతినిధుల సమక్షంలో సైతం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డిపై పోటీలో నిలిపేందుకు దామోదర సతీమణి పద్మిని దామోదరను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పాటు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిప్యూటీ సీఎం ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు జగ్గారెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తూ సీఎంకు మద్దతుగా నిలిచారు.
గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా సదాశివపేట మండలం వెల్టూరుకు ముఖ్యమంత్రిని తీసుకు వచ్చేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించగా ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్న సీఎంను జిల్లాలో తిరగనివ్వబోమని ఉప ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రులు, డీసీసీ అధ్యక్షుడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చివరి క్షణంలో అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రి పర్యటన రద్దయిన సంగతి విదితమే. కొం తకాలంగా దూరంగా ఉన్న వీరు ఒక్కటవడంలో మతలబు ఏమిటనేప్రశ్న అందరిలో నెలకొంది. కాగా సంగారెడ్డిలో జరిగిన విందులో దామోదరకు జగ్గారెడ్డి కొసరికొసరి వడ్డించడం కొసమెరుపు.