
'ఆత్మగౌరవం తెలుగువాడి మీసంలో ఉంది'
హైదరాబాద్: పార్టీలను పక్కనపెట్టి జేఏసీగా ఏర్పడదామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిలుపునిచ్చారు. అందరం డ్రామాలు ఆపేద్దామని, పార్టీలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర ఎజెండాతో ముందుకెళదామని కోరారు. రాష్ట్రంలో ఎక్కువ మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఆత్మగౌరవం తెలుగువాడి మీసంలో ఉందన్నారు. తెలుగువాడి రోషంలో ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. మిగతా పార్టీలు కూడా ఇదే దారిలో నడవలన్నారు.
చంద్రబాబు నాయుడు నాటకాలు కట్టిపెట్టి సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలన్నారు. రథయాత్రలు కట్టిపెట్టాలన్నారు. పాములా బుస కొడుతున్న సమైక్య ఉద్యమానికి నీరుపోయాలన్నారు. గతంలో తెలంగాణ నాయకులు వ్యవహరించిన విధంగా ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నాయకులను కలుద్దామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీ ఎజెండా వారిదే అన్నారు. అసెంబ్లీలో తీర్మానం వస్తే అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు.