నిప్పుల కొలిమి
రాష్ట్రంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు
కొత్తగూడెంలో అత్యధికంగా 49.5 డిగ్రీలు
పాల్వంచలో 48, నిజామాబాద్‌లో 46.4,
రామగుండంలో 46, హైదరాబాద్‌లో 42.9 డిగ్రీలు
నేడు మరో డిగ్రీ పెరిగే అవకాశం
వడదెబ్బకు రాష్ర్టవ్యాప్తంగా ఒక్కరోజే 39 మంది మృతి
మరో మూడు రోజులు వడగాడ్పులు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో అగ్నిగుండాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడానికే సాహించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బుధవారం సాయంత్రం వరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో 49.5 డిగ్రీలు, పాల్వంచలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్‌లో 46.4 డిగ్రీలు, రామగుండంలో 46 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.9 డిగ్రీలు రికార్డయ్యాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ వివరాలను హైదరాబాద్ వాతావారణ శాఖ ధ్రువీకరించలేదు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రాంతంలో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. గాలిలో తేమ 17 శాతానికి చేరుకోవడంతో వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం మరో డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, రాజధానిలో ఎండల తీవ్రత వల్ల వడదె బ్బ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. బుధవారం నగరంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో వంద మందికిపైగా వడదెబ్బ బాధితులు చేరినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇక గత 24 గంటల్లో నల్లగొండలో 45 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 44 డిగ్రీలు, హన్మకొండలో 43, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 42 డిగ్రీలు, హకీంపేటలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉసురుతీస్తున్న వడదెబ్బ
వడదెబ్బతో రాష్ర్టవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 39 మంది చనిపోయారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కరోజే 11 మంది చొప్పున చనిపోయారు. ఖమ్మం జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. మిగతా జిల్లాల్లోనూ ఎండలకు 12 మంది బలయ్యారు. బొగ్గు గని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. జిల్లాలో రెండు రోజులుగా సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. కొత్తగూడెం, టేకులపల్లి, మణుగూరు, సత్తుపల్లి ఏరియాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్మికులు విధులకు హాజరు కాలేకపోతున్నారు. నిజానికి 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా, సెలవు ప్రకటనతోపాటు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుందని అధికారులు ఆ విషయాన్ని వెల్లడించడం లేదని గని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఏపీలోనూ భానుడి భగభగలు
ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. బుధవారం విజయవాడలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాడ్పులు కూడా తీవ్రమవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో వడదెబ్బకు గురై 29 మంది మరణించారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. ఇవి మరో రెండు మూడు డిగ్రీల వరకు పెరగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.