నేడే ఎంసెట్ టెన్షన్ వద్దు
- నిపుణుల సూచన
- పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- విద్యార్థులు గంటముందే రావాలి
పెనమలూరు, న్యూస్‌లైన్ : ఎంసెట్-2014 గురువారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంసెట్ పరీక్ష హాలుకు విద్యార్థులు గంట ముందే హాజరు కావాల్సి ఉంది. విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్ష రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. విజయవాడ రీజియన్‌లో ఇంజనీరింగ్‌కు 22,050, మెడిసిన్‌కు 14,950 మంది హాజరుకానున్నారు.
మొత్తం 37 వేల మంది పరీక్ష రాయనున్నారు. ఎంసెట్ కోసం ఇంజనీరింగ్‌కు 42, మెడిసిన్‌కు 28 చొప్పున విజయవాడ రీజియన్‌లో మొత్తం 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ రాసేవారు ఉదయం 9.15 గంటలకు, మెడిసిన్ అభ్యర్థులు మధ్యాహ్నం 1.45 గంటలకు పరీక్ష హాలుకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.
ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు
విజయవాడ సిటీ : విజయవాడ రీజియన్ పరిధిలో జరగనున్న ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం 130 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుదేష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో 50 సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం 80 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.