పదో షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగుల పంపిణీకి కమిటీ
* ఆంధ్రా నుంచి ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ నుంచి రామకృష్ణారావు
* 22 శాఖలు, 15 రాజ్యాంగ సంస్థల సిబ్బంది పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లో ఉన్న 22 శాఖలు, 15 రాజ్యాంగ సంస్థల ఉద్యోగుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కమిటీని నియమించాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ, రాష్ట్ర ఫునర్విభజన విభాగం కార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పదో షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగుల పంపిణీ తన పరిధిలోకి రాదని కమలనాథన్ కమిటీ తెలిపింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్.కృష్ణారావు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పోలీసు, వ్యవసాయం, పశుసంవర్థక, విద్యా శాఖ, సంక్షేమ శాఖల్లోని పోస్టులు, ఉద్యోగులను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయింది.
కమలనాథన్ మార్గదర్శకాలతో 9 వ షెడ్యూల్లోని ఉద్యోగుల పంపిణీ చేయండి
కమలనాధన్ కమిటీ మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థల ఉద్యోగుల పంపిణీని చేయాలని ఆ సంస్థల విభజనపై ఏర్పాటైన షీలా బిడే కమిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు లేఖ రాశారు. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా ఇదే తరహా లేఖను షీలా బిడే కమిటీకి రాయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
పే అండ్ అకౌంట్‌లో ఎక్కువ పోస్టులు కోరుతున్న తెలంగాణ
పే అండ్ అకౌంట్ ఆఫీస్‌లోని పోస్టుల్లో ఎక్కువ తెలంగాణకు కావాలని తెలంగాణ పే అండ్ అకౌంట్ అధికారులు కోరుతున్నారు. అలాగే సెరికల్చర్, ఉద్యానవన విభాగాల్లో కూడా ఎక్కువ పోస్టుల కావాలని కోరుతున్నారు. దీనిపై కమలనాథన్ కమిటీ స్పందిస్తూ ఇరు రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల అధికారులు అంగీకరిస్తేనే ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ పోస్టులు కేటాయిస్తామని చెప్పింది. ఇరు రాష్ట్రాలు అంగీకరించకపోతే జనాభా ప్రాతిపదికనే పోస్టులు, ఉద్యోగుల పంపిణీ చేస్తామని స్పష్టంచేసింది.
పోస్టులు, ఉద్యోగుల పంపిణీపై 28న ఢిల్లీలో సమావేశం
రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు, ఉద్యోగుల పంపిణీపై ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను వివరించేందుకు ఈ నెల 28నఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లాలని కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా పాల్గొంటారు.