సంక్రాంతి సందర్భంగా శింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అద్దంకి, న్యూస్‌లైన్ : సంక్రాంతి సందర్భంగా శింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆలయ వేదపండితులు షోడపోచార.. రాజోపచార.. సకలోపచార పూజలు చేశారు. అనంతరం ఉభయ దేవతామూర్తులను వసంత మండపం వద్దకు తీసుకెళ్లి మంగళవాయిద్యాలతో వేదస్వస్తి, హరెరామనామ సంకీర్తనలతో ఆలయ ప్రదక్షిణ చేయించారు.
అనంతరం స్వామివార్ల పల్లకీని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య భవనాశి చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కుంభం పోసి కూష్మాండబలి ఇచ్చి స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన పడవలో భవనాశి చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు వంగల శివశంకరావధాని మాట్లాడుతూ తెప్పోత్సవాన్ని వరుసగా 49 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కనుమ సందర్భంగా ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమణమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.