- పింఛను తొలగింపుపై ఆవేదన
- జన్మభూమిలో నిలదీసిన బాధితులు
చోడవరం : ‘బాబూ కాళ్లూ చేతులు సరిగ్గా లేవు.. కళ్లు సరిగ్గా కనిపించవు... వెయ్యి రూపాయల పింఛనొస్తుందని ఆశపడితే.. ఇచ్చే రెండొందల పింఛను తొలగిస్తారా? ఇదేం అన్యాయం బాబూ’ అవయాలు కోల్పోయి, కదలలేని స్థితిలో ఉన్న మట్టిపిడి గంగమ్మ ఆవేదన ఇది. ‘నాకు కళ్లు కనిపించవు. నాలాటిదాన్ని పింఛనే తీసేత్తారా.. ఇదే నాయం బాబూ’ అంటూ తాకేటి చినతల్లి అనే నిరాదరణ అంధ మహిళ రోదన . ఇలాంటి అభాగ్యులెందరో పింఛన్ కోల్పోయి జన్మభూమి గ్రామ సభల్లో అధికారుల ముందు నెత్తీ నోరు కొట్టుకుంటున్న హృదయవిదాకర సంఘటనలు వెలుగుచూశాయి. చోడవరం మండలం గవరవరంలో శనివారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పింఛన్ జాబితాలో పేర్లు లేని ఎందరో అభాగ్యులు అధికారుల ముందు కన్నీరు పెట్టారు. ఈ గ్రామంలో 31 మంది పింఛన్లు తొలగించారు.
వీరిలో నిరుపేదలైన అవ యవాలు స్వాధీనంలో లేని నిర్భాగ్యులు, అనాథ మహిళలు ఉన్నారు. పింఛన్ జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు వృద్ధులు టీడీపీకి చెందిన సర్పంచ్ చప్పగడ్డి వెంకటస్వామి నాయుడును, అధికారులను నిలదీశారు. హైదరాబాద్‌లో జాబితాను తొలగించారని, మళ్లీ ఇస్తామంటూ స్థానిక సర్పంచ్ చెప్పడానికి ప్రయత్నించినప్పటకీ వారు శాంతించలేదు. ఈ సభకు దిగువ స్థాయి అధికారులు మాత్రమే రావడంతో వీరి రోదన అరణ్య రోదనే అయ్యింది. ఈ గ్రామానికి చెందిన మట్టిపిడి గంగమ్మ కాళ్లు చేతులు పనిచేయక పోగా, ఎడమ చేతికి ఒక వేలు మాత్రమే ఉంది. మండ వరకు మిగిలిన వేళ్లు కోల్పోయింది. ఈమె భర్త 60 ఏళ్ల వయస్సులో రిక్షా లాగుతున్నాడు. ఈమెను పేరును జాబితా నుంచి తొలగించారు. కళ్లు కనిపించక... నా అన్న వారెవరూ లేని తాకేటి చినతల్లి పింఛన్ కూడా తొలగించారు.
వైద్య సిబ్బందిపై ఫిర్యాదు
ఇదిలా ఉండగా స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదంటూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనర్హత పేరుతో 449 యూనిట్ల బియ్యం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెడెంట్ శివ, హెచ్‌డీటీ రామారావు, సీడీపీఓ ఉమాదేవి, గ్రామకార్యదర్శి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదేమి అన్యాయం ‘బాబూ’!
Published Sun, Oct 5 2014 5:08 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
Advertisement
Advertisement