మిస్టరీగా మారుతున్న కేసులు | The changing mystery cases | Sakshi
Sakshi News home page

మిస్టరీగా మారుతున్న కేసులు

Published Tue, Aug 20 2013 5:26 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

The changing mystery cases

ఆదిలాబాద్/మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో దోపిడీ దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. గొలుసుకట్టు హత్యలతో హతమారుస్తూ, దోపిడీకి పాల్పడుతున్నారు. నగలు, నగదు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డొచ్చినవారిని మానవత్వం లేకుండా రాడ్లు, కత్తులతో చిన్నా, పెద్దా అని చూడకుండా నరుకుతూ తమ పనికానిస్తున్నారు. ప్రధానంగా తల, ముఖంపై బాదుతున్నారు. ఒంటిపైన నగలు, బీరువాలో దాచుకున్న విలువైన సామగ్రిని దోచుకెళ్తున్నారు. మూడేళ్లలో రాత్రి, పగలు తేడా లేకుండా జిల్లాలో దాదాపు 1500పైగా దొంగతనాలు జరిగాయి. నాలుగేళ్లలో రూ.8 కోట్లకుపైగా సొత్తు దొంగలు దోచుకెళ్లారు. ఉదయం రెక్కీ నిర్వహిస్తూ రాత్రి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు ఆ రోజు రాత్రి ఆ ఇ ల్లు గుల్ల అయినట్టే. ఇల్లే కాకుండా, బ్యాం కులు, దుకాణాలకు కూడా కన్నం వేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. స్థానికుల సహకారంతో పొరుగు రాష్ట్రంవారు పనికానిచేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం కేసులను ఛేదించడంలో విఫలం చెందారు.
 
 అంతర్రాష్ర్ట ముఠా పనేనా?
 జిల్లాలో దొంగతనాలు, హత్యలు అనేకం జరిగాయి. తాజాగా బాసరలో ముగ్గురి హత్య, మంచిర్యాలలో ఇద్దరి హత్య వెనుక పగలు, ప్రతీకారాలు లేవు. కేవలం నగలు, నగదు కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యలను పరిశీలిస్తే అంతర్రాష్ర్ట్ర దొంగల ముఠా కిరాతకంగా పోలీసులు భావిస్తున్నారు. ముందుగా హత్య చేసిన తర్వాత దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో స్థానికంగా డబ్బులు, నగల కోసం హత్యలు జరిగినా దొంగల ముఠాల ప్రమేయం లేదు. రెండు రోజుల క్రితం జరిగిన ఐదుగురి హత్యలు ప్రొఫెషనల్ కిల్లర్ల పనేనని పోలీసులు కూడా సందేహిస్తున్నారు. పాత నేరస్థుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. జిల్లా సరిహద్దు పెద్దదిగా ఉండటం, చుట్టూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉండటం, రైల్వే మార్గం కూడా ఉండటంతో దొంగలు సులువుగా తప్పించుకోవడానికి వీలుంది. ఈ రాష్ట్రాలతోపాటు బీహార్, తమిళనాడు దొంగల ముఠాల ప్రమేయం ఉందా అనే ఆందోళనను జిల్లావాసులు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పార్ది ముఠా దొంగలు ఇలాంటి దురాగతాలకు పాల్పడతారని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కనున్న నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినట్లు పోలీసుల దృష్టిలో ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
 కొలిక్కిరాని కేసులు
 పశ్చిమ ప్రాంతంలో..
     ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో కొన్నేళ్ల క్రితం ఓ ఇంట్లో చొరబడి దొంగలు వృద్ధురాలి చెవులు కోసి నగలు అపహరించి దారుణంగా హతమర్చారు.
 
     నిర్మల్‌లోని శాస్త్రీనగర్‌లో 2002లో ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో చొరబడి ఆయనను హతమర్చి, ఆయన భార్యను తీవ్రంగా గాయపర్చి ఇంట్లోని నగలు, డబ్బులు ఎత్తుకెళ్లారు.
 
     ఆదిలాబాద్ పట్టణంలోని ఖోజా కాలనీలో కొన్నేళ్ల కిందట ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు కత్తులతో దాడిచేసి ఒకరిని హతమర్చడమే కాకుండా తుపాకీతో కాల్పులు జరపడం సంచలనం కలిగించింది.
 
     నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లో ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు కత్తులతో బెదిరించి సుమారు 60 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
 
     జూన్ 3, 2013న ఇచ్చోడ దక్కన్ గ్రామీణ బ్యాంక్ క్యాషియర్, అటెండర్ కలిసి ఆదిలాబాద్‌లోని డీజీబీ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.30 లక్షలు తీసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దేవాపూర్ చెక్‌పోస్టు వద్ద పట్టపగలే ముగ్గురు దోపిడీ దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి బ్యాంక్ సిబ్బంది కంట్లో కారం చల్లి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటే పరిస్థితిని అర్థం  చేసుకోవచ్చు.
 
 తూర్పు ప్రాంతంలో..
     గతేడాది ఏప్రిల్ 2న మంచిర్యాల ఐబీ పక్కన పాల విక్రయ కేంద్రం వ్యాపారి వేమురెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి హత్యకు గురయ్యారు. వెంకటేశ్వర్‌రెడ్డి హత్యను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్‌రావు, అప్పటి మంచిర్యాల సీఐలు భీమన్న, లక్ష్మీనర్సింహస్వామిలు కేసును ఛేదించేందుకు పరిశోధన చేశారు. ప్రతి రోజు పాలకేంద్రానికి వచ్చేవారిని, కరీంనగర్ నుంచి పాలు తీసుకవచ్చే వాహనం డ్రైవర్‌ను విచారించారు. అయితే క్లీనర్ రాకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆ అనుమానమే నిందితులను పట్టించింది. క్లీనర్ రోజు పాల అమ్మకాల ద్వారా వచ్చే రూపాయలు పెద్ద మొత్తంలో వెంకటేశ్వర్‌రెడ్డి దగ్గర నిల్వ ఉన్నాయనే విషయం తెలుసుకున్న క్లీనర్ మహారాష్ట్రకు చెందిన మరో ముగ్గురు నిందితులతో కలిసి హత్యకు పథకం రచించాడు. అనంతరం పోలీసులకు దొరికాడు.
 
     నాలుగేళ్ల క్రితం మంచిర్యాలలోని యమహ షోరూంలో పనిచేసే వాచ్‌మన్ హత్యకు గురయ్యాడు. యమహ వాహనంతోపాటు క్యాష్‌కౌంటర్‌లో నగదు దోపిడీకి గురైంది. సంచలనం రేకెత్తించిన కేసు కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరకు షోరూంలో పని చేసే ఓ యువకుడు డబ్బుల కోసం మిత్రులతో కలిసి వాహనాల దొంగతనానికి పాల్పడ్డాడు. వాచ్‌మన్ వారిని వారించబోతూ నిందితున్ని గుర్తించాడు. తమగుట్టు రట్టుకాకుండా వాచ్‌మన్‌ను హత్యచేశాడు. చివరకు పోలీసులకు దొరికారు.
 
     అలాగే మంచిర్యాల పురపాలక సంఘంలో టౌన్‌ప్లానింగ్ అధికారి క్లిస్టఫర్‌రాజు తల్లిని కూడా ఓ దొంగ బంగారం కోసం హత్యచేశాడు. 2009 సంవత్సరంలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా అప్పుడే అటుగా వచ్చిన గుర్కాను దొంగలు హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు మరో కేసులో పోలీసులకు పట్టుబడడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
 
     మందమర్రిలో గతేడాది ఆగస్టులో దక్కన్ గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. రూ.18 లక్షలు ఎత్తుకెళ్లారు. అయితే ఇప్పటికీ దొంగల ఆచూకీ లభించలేదు.
 
     ఈ నెల 9వ తేదీన బెల్లంపల్లిలోని 2 ఇంక్లైన్‌లో రవి ఇంట్లో దొంగలు 10 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఇంట్లో లేని సమయంలో దొంగలుపడి రూ.2.55 లక్షల విలువ గల బంగారు నగలు, రూ.2 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికీ మిస్టరీ తేలలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement