సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఇన్నాళ్లూ వర్గవిభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీని అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం నట్టేటా ముంచేసింది. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు చెట్టుకొకరు... పుట్టకొకరులా చెల్లాచెదురవుతున్నారు. దీంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాగా... విభజన నేపథ్యంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా... రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మాత్రం చేతులెత్తేశారు. ఆయన రాజకీయ మనుగడ కోసం వలస బాట పడుతున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటున్న మంత్రి శైలజనాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్‌లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మసలుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం జూలై 30న నిర్ణయం తీసుకోగానే జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఎగిసింది. 40 రోజులుగా ఉధృతంగా కొనసాగుతోంది. జిల్లాలో
సమైక్య సెంటిమెంటు నానాటికీ బలపడుతోండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రజల మనోభావాల మేరకు సమైక్యాంధ్ర కోసం ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు సరికొత్త డ్రామాలకు తెరతీశారు. తద్వారా ప్రజావ్యతిరేకతను తప్పించుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం సాధించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2009 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో ఒంటరిగా మారారు.
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుతం ఆయన ఎత్తులు వేస్తున్నారు. సమైక్యవాదాన్నే విన్పిస్తోన్న జేసీ.. రాష్ట్ర విభజన ఖాయమైతే రాయలసీమను విభజించి అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనను డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా బలపరిచారు. వారిద్దరూ ఇప్పుడే జేసీ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో జేసీ ప్రత్యర్థి అయిన రెవెన్యూ మంత్రి రఘువీరా చేతులెత్తేశారు. రాష్ట్ర విభజన ఖాయమైతే జిల్లాలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని రఘువీరా భావిస్తున్నారు. జిల్లాలోని 14 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక రాజకీయాలపై మక్కువ చూపిస్తున్నారు. మడకశిర నియోజకవర్గానికి కూతవేటు దూరంలోని తుమకూరు లోక్‌సభ స్థానంపై కన్నేశారు. అక్కడి నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇది జిల్లాలో రఘువీరా వర్గాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ వర్గంలోని నేతలు చెట్టుకొకరు పుట్టకొకరులా చెల్లాచెదురయ్యారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని ప్రకటిస్తున్నా.. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి మాత్రం వెనుకంజ వేస్తున్నారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి లోక్‌సభ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మడకశిర ఎమ్మెల్యే కె.సుధాకర్ మాత్రం సమైక్యాంధ్రకు కట్టుబడి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌లో ఒక్కో నేత ఒక్కో నినాదం చేస్తోండటంతో జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానమే విభజన నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెల్లుబుకుతోంది. ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో డ్రామాలు ఆడుతున్నారనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభిప్రాయాలను గౌరవించకుండా... ఏ డ్రామాలాడినా కాంగ్రెస్ నేతలను విశ్వసించరని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. వారి వాదనతో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి కూడా ఏకీభవిస్తూ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.
అగచాట్లలో హస్తం
Published Mon, Sep 9 2013 5:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement