అడవి విస్తీర్ణం రోజురోజుకూ తరిగి పోతున్నది. అడ్డగోలుగా అక్రమంగా అడవి లోని చెట్లను అక్రమార్కులు నరుకుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
అడవిలో అగ్గిపెట్టెతో కనిపించినా కేసు నమోదు చేయొచ్చు. అంత కఠినంగా ఉంటాయి అటవీ చట్టాలు. ఈ చట్టాల నుంచి తప్పించుకోలేక సెలబ్రిటీలే జైలు పాలయ్యారు. అంత కఠిన చట్టాలున్నా అడవిని అడ్డగోలుగా నరుకుతున్న వారిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అడవిలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టి బిల్లులు డ్రా చేసినా... పట్టించుకోవడం లేదు. వందల ఎకరాల అటవీ ప్రాంతం కాలక్రమేణా తుడిచి పెట్టుకుపోతున్నా అటవీ శాఖ నిద్ర పోతూనే ఉంది.
దేవరకొండ, న్యూస్‌లైన్ : అడవి విస్తీర్ణం రోజురోజుకూ తరిగి పోతున్నది. అడ్డగోలుగా అక్రమంగా అడవి లోని చెట్లను అక్రమార్కులు నరుకుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. చందంపేట మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం వేల ఎకరాల మేర విస్తరించి ఉంది. చందంపేట రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొన్ని వందల రకాల చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే ఆయా పరిధిలో చెట్లను నరికి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. చందంపేట మండలంలోని నల్లచెలమూల, చిత్రియాల, పెద్దమూల గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో కొంతమంది సుమారు వంద ఎకరాల మేర అడవిని నరికారు. అయినా అటవీశాఖ అధికారులు తమ దృష్టికి రాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఆయా గ్రామాల పరిధిలోని కొంతమంది అటవీ ప్రాంతంలో చెట్లను నరికి వ్యవసాయ యోగ్యంగా భూములను మార్చుకోవడానికి యత్నిస్తున్నారు. అందుకోసం అడవిలో పెరిగిన పెద్దపెద్ద బిల్లుడు, నీళ్ళమారి, నర్లంగ వంటి చెట్లను నరికి వేశారు.
గతంలో నాగార్జునసాగర్ ముంపు సమయంలో కొంతమంది పెద్దమూల గ్రామస్తులకు గుట్టపై నల్లపడే, ఎర్రపడే ప్రాంతాల్లో డీ ఫారెస్ట్ భూములను పట్టాలుగా ఇచ్చారు. ఆ భూములే కాక ఆ పరిధిలో ఆరు నెలల కాలంలో కొంతమంది గుట్టలపై వ్యవసాయం చేసుకునేందుకు చెట్లను నరికారు. గుండాల మూల గుట్టల్లో చాలావరకు అక్రమార్కులు చెట్లను నరికి వాటిని తరలించుకపోవడమే కాకుండా అడవి భూముల్లో వ్యవసాయం చేయాలని భావిస్తున్నారు. గత ఆరు నెలల క్రితం అడవిలో చాలా మేరలో అడవిలోని చెట్లను నరికేశారు.
నిబంధనల ప్రకారం అటవీ భూముల్లో వ్యవసాయం చేయడానికి, ఏ ఇతర కార్యాకలాపాలకు అటవీ భూములను వినియోగించుకోరాదు. అటవీ భూముల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అటువంటిది ఈ ప్రాంత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడమే కాకుండా తమకు సమాచారం తెలియదనట్లు ఉంటున్నారు.
ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం...
చందంపేట రేంజ్ పరిధిలో అవకతవకలు, అక్రమాలపై అధికారులు ఉన్నతాధికారులను తప్పుదొవ పట్టిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో చిత్రియాల అటవీ ప్రాంతంలో కొందరు చెట్లు నర క డంతో అధికారులు చిత్రియాల, నల్లచెలమూలకు చెందిన నలుగురిపై కేసులు నమోదు చేశారు. అయితే అటవీ అధికారుల అంచనా ప్రకారం 200 చెట్లను మాత్రమే నరికారని అధికారులు భావిస్తున్నా చిత్రియాల, పెద్దమూల, నల్లచెలమూల అటవీ ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల మేర అటవీ భూములను నరికారనేది వాస్తవం. ఇదిలా ఉండగా ఇటీవల సాగర్ డివిజన్ డీఎఫ్‌ఓగా వచ్చిన భబిత అక్రమార్కులపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అడవిని నరికి బొగ్గుగా మార్చి తరలిస్తున్న ఒక లారీని సీజ్ చేయడంతోపాటు రూ 2.87లక్షల మేర జరిమానా కూడా విధించారు. అయితే నల్లచెలమూల, చిత్రియాల, పెద్దమూల అటవీ ప్రాంతంలో అడవులను నరుకుతున్నారని సమాచారం రావడంతో డీఎఫ్‌ఓ క్షేత్ర పరిశీలన కూడా చేశారు. కానీ, స్థానిక అధికారులు ఆమెకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది.