జీఓఎం తుది సమావేశం, కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో సెక్షన్-30 పోలీస్ యాక్ట్‌ను అమలులోకి తెచ్చినట్లు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : జీఓఎం తుది సమావేశం, కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో సెక్షన్-30 పోలీస్ యాక్ట్‌ను అమలులోకి తెచ్చినట్లు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా సంబంధిత పోలీస్ సబ్ డివిజన్ అధికారి నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలన్నారు.
ఆయా సభలు, సమావేశాలకు తగిన బందోబస్తు చర్యలు చేపట్టేందుకు వీలుగా దీన్ని అమలులోకి తెచ్చామని ఎస్పీ వివరించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వచ్చినా ప్రజలు ఆందోళనలను శాంతియుతంగా నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, పోలీసులతో సహకరించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.