ఒప్పందాలే ప్రధాన లక్ష్యం
బాబు బృందం జపాన్ పర్యటన వివరాలు వెల్లడించిన పరకాల ప్రభాకర్
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నా రు. చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రతి నిధి బృందం ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో పర్యటించనుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు అవగాహనా ఒప్పందాలు చేసుకోనుందని చెప్పారు. జపాన్ పర్యటన బృం దంలో 18 మంది ప్రభుత్వ ప్రతినిధులు, మరో 35 నుంచి 40 మంది వివిధ పారిశ్రామికవర్గాల వారు ఉన్నారన్నారు. ఆదివారం సచివాల యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పరకాల మాట్లాడారు. సీఎం నేతృత్వంలో జపాన్ ప్రభుత్వంతో పాటు పలు సంస్థలతో.. ఆధునిక వ్యవసాయ యంత్రాల పనితీరు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతస్థాయి చర్చలు, అవగాహనా ఒప్పందాలు జరుగుతాయని చెప్పారు.
పారిశ్రామిక, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో పాటు బ్యాంకింగ్ రంగ ప్రముఖులతోనూ ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్రిడ్‌ను ఎలా అభివృద్ధి చేయాలి, గ్యాస్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై ప్రముఖ సంస్థలైన జైకా, జెట్రో, జేపీఐసీ, జేపీసీసీ, నెడ్కో వంటి సంస్థలతో చర్చలు, అవగాహనా ఒప్పం దాలు ఉంటాయన్నారు. భారత్‌కు చెందిన ఐటీ ఫోరంతో, జపాన్ మేయర్లతో, వ్యాపార..వాణిజ్య మంత్రిత్వ శాఖతో ఏపీ ప్రతినిధులు సమావేశమవుతారని తెలిపారు. పరిశ్రమల మంత్రి మియజావాతోనూ భేటీ ఉంటుందన్నారు.
సుమిటోమోతో నాలుగు ఒప్పందాలు
జపాన్‌లోని ప్రముఖ సంస్థ సుమిటోమో కార్పొరేషన్‌తో ప్రధానమైన నాలుగు ఒప్పందాలు చేసుకోనున్నట్టు పరకాల చెప్పారు. అవి
ఇలా..
►అత్యాధునిక వ్యవసాయ పనిముట్లు, దిగుబడిని పెంచే వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక అభివృద్ధి
►శ్రీకాకుళంలో నిర్మించతలపెట్టిన 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు, నిధుల సమీకరణ, సాంకేతిక సహకారం
►రాజధాని నిర్మాణంలో స్మార్ట్ సిటీకి అవసరమయ్యే అత్యాధునిక రవాణా వ్యవస్థ, గ్యాస్ యుటిలైజేషన్, వ్యర్థాల వినియోగం, పట్టణ ప్రాంతానికి ఉండాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహకారం
►ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధి బాబు ప్రసంగాలన్నీ జపనీస్‌లోకి..
సీఎం చంద్రబాబు ప్రసంగాలన్నీ జపనీస్ భాషలోకి అనువదించేందుకు ఒక దుబాసీ (ట్రాన్స్‌లేటర్)ని ఏర్పాటు చేసినట్టు పరకాల తెలిపారు. వివిధ అంశాలతో సీడీలు, బ్రోచర్లను ఇంగ్లిష్‌తో పాటు, జపనీస్ భాషలో రూపొందించినట్టు చెప్పారు. పలు అంశాలపై బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు.