విద్యార్థిని అనుమానాస్పద మృతి
విజయవాడ, న్యూస్‌లైన్ : కృష్ణలంకలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె చనిపోయిన తీరును బట్టి హత్యకు గురైందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ రోజు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణలంక భూపేష్‌గుప్తా నగర్‌కు చెందిన అప్పికట్ల చాముండేశ్వరి(19) పటమటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి రాంబాబు లారీ డ్రైవర్.
గురువారం మహాశివరాత్రి కావడంతో ఆమె తల్లి అనూరాధ, అన్న లోకేష్ బంధువులతో కలిసి ఉదయం కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. శుక్రవారం పరీక్ష ఉందని చెప్పి చాముండేశ్వరి వారి వెంట వెళ్లలేదు. లోకేష్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం వస్తుండటంతో తాళం పగులగొట్టి లోనికి వెళ్లాడు. చాముండేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. కిందకు దింపి, అప్పటికే చనిపోయినట్లు గుర్తించాడు. కుటుంబసభ్యులతో కలిసి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. ఏసీపీ కె.లావణ్యలక్ష్మి, కృష్ణలంక సీఐ షేక్ అహ్మద్ అలీ, ఎస్సై జి.శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు.
హత్యా ? ఆత్మహత్యా..?
చాముండేశ్వరి మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె రెండు చేతులు కట్టేసి ఉన్నాయి. చున్నీ పక్కనే ఉన్న మంచానికి కట్టి ఉంది. కాళ్లు నేలకు ఆని ఉన్నాయి. ఉరి బిగించి ఉండటంతో ఎవరైనా లైంగికదాడికి పాల్పడి హత్య చేసి, ఉరివేసి, ఇంటికి తాళం వేచివెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుంటానన్న భయంతో ముందుగానే చేతులను కట్టేసుకుని ప్రాణం తీసుకుందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని లోపలకు వెళ్లి గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుందన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటాను సేకరిస్తున్నారు.
మధ్య గదిలో పుస్తకాలు
శుక్రవారం పరీక్ష ఉందని చెప్పిన చాముండేశ్వరి మధ్య గదిలో చదవటానికి పుస్తకాలు పెట్టుకుంది. పక్కన ఉన్న మరో గదిలో చనిపోయింది. తమకు ఎవరితో వివాదాలు లేవని మృతురాలి తల్లి అనురాధ కన్నీటిపర్యంత మవుతూ పోలీసులకు చెప్పింది.