ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే సర్పంచ్‌లకు అధికారాలు, నిధులతో పాటు వారు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన వేతనం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన బీసీల రాజకీయ చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. శాసనమండలికి జరిగే ఎన్నికల్లో సర్పంచ్‌లకు కూడా ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడే సర్పంచ్‌లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు ఉండాల్సిందేనన్నారు. సర్పంచ్‌లకు నెలసరి వేతనం రూ.20 వేలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే 20వేల మంది సర్పంచ్‌లతో కలిసి హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.
సీల్డ్ కవరు ద్వారా ముఖ్యమంత్రిగా ఎంపికైన కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజా సమస్యలపై అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీసీ సర్పంచ్‌లు పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉందన్నారు. బీసీలు నేడు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదస్సులో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన సంగతిని గుర్తు చేశారు. బీసీల కోసం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఆర్.కృష్ణయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరారు. సదస్సుకు అధ్యక్షత వహించిన బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు జి.మల్లేశ్‌యాదవ్ మాట్లాడుతూ కులాలు, రాజకీయాలకతీతంగా బీసీలందరూ ఐక్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ బీసీల కోసం అహర్నిశలు పోరాడిన ఘనత కృష్ణయ్యకే దక్కుతుందని కొనియాడారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ సర్పంచ్‌లు ప్రజోపయోగకరమైన పనులను చేపట్టాలని కోరారు. రాయపోల్ సర్పంచ్ పాశం అశోక్‌గౌడ్, బీసీ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మారోజు వెంకటేశంచారి కూడా మాట్లాడారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, ఆర్.కృష్ణయ్యలతో పాటు బీసీ సర్పంచ్‌లను సన్మానించారు. సభలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డబ్బికార్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు కొత్తకుర్మ శివకుమార్, బీసీ ఫ్రంట్ నాయకులు ఆవ జంగయ్య, శ్రీరాములు, కృష్ణాయాదవ్, రామాచారి, ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, బ్రహ్మచారి, ఎం. శ్రీనివాస్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. సభలో కళాకారులు ఆటపాటలతో ఆహూతులను అలరించారు.
సర్పంచ్‌లకు రూ.20వేల వేతనం ఇవ్వాలి
Published Thu, Oct 31 2013 12:42 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement