రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో కొత్తగా రెండో పంట వేసుకోదలిచే రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి కే పార్థసారధి భరోసా ఇచ్చారు.
- రాజధాని ప్రాంత రైతులకు వైఎస్సార్‌సీపీ భరోసా
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో కొత్తగా రెండో పంట వేసుకోదలిచే రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి కే పార్థసారధి భరోసా ఇచ్చారు. ఆ ప్రాంతంలో కొత్తగా పంట వేసుకోవడానికి అనుమతి లేదన్న ప్రభుత్వ ప్రకటనతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారికి మద్దతుగా ఈ నెల 13న ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకుల బృందం పర్యటిస్తుందని ఆయన చెప్పారు.
అవసరాన్ని బట్టి రెండో రోజు పర్యటన ఉంటుందన్నారు. రాజధాని ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ నియమించిన కమిటీ సభ్యులు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, సజ్జల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం పార్టీ నేతలతో కలిసి పార్థసారధి మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతులను పంట వేసుకోవద్దని ప్రభుత్వం ప్రకటించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్టీ నేతల కమిటీ అక్కడ పర్యటించి రైతుల్లో ధైర్యం నింపుతామన్నారు.