విద్యుత్ సంక్షోభం
- సగానికి పడిపోయిన ఉత్పత్తి
- రెండవ యూనిట్ ఇప్పటికే బంద్
- అర్ధరాత్రికి మరో రెండు యూనిట్లు మూసివేత
- బొగ్గు కొరత
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ( ఎన్టీటీపీఎస్)లో ఇంజినీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఆదివారం సాయంత్రానికి ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇదే పరిస్థితి సోమవారం కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీటీపీఎస్‌లో తగ్గుతున్న బొగ్గునిల్వలు
ఎన్టీటీపీఎస్‌కు ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా అవుతుంది. అలా వచ్చిన బొగ్గును ట్రక్కుల ద్వారా ఎన్టీటీపీఎస్‌కు చేర్చి కన్వేయర్‌బెల్ట్ ద్వారా ప్లాంట్‌లోకి సరఫరా చేస్తారు. అయితే ఉద్యోగస్తులు మెరుపు సమ్మెలో రైల్వే వ్యాగన్లలో వచ్చిన బొగ్గును కన్వేయర్ బెల్డ్ వరకు సరఫరా చేసే సిబ్బంది కరువయ్యారు. దీంతో ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న బొగ్గును ఉపయోగించి, ఆ తరువాత ఆయిల్ ఫైరింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఎన్టీటీపీఎస్‌లో ఏడు యూనిట్లు ఉన్నాయి. అయితే బొగ్గు తగినంతగా అందక పోవడంతో రెండవ యూనిట్ ట్రిప్పింగ్ అయింది. కాగా ఆదివారం అర్ధరాత్రికి ఐదు, ఆరు యూనిట్లు కూడా ఆగిపోవచ్చని కార్మిక సంఘాలనేతలు చెబుతున్నారు. సోమవారం ఇదే పరిస్థితి కొనసాగితే ఏడు యూనిట్లు నిర్వహణ కష్టమేనని ఇంజనీర్లు అంగీకరిస్తున్నారు.
సగానికి పడిపోయిన ఉత్పత్తి...
ప్లాంట్‌లోని ఏడు యూనిట్ల ద్వారా 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రెండవ యూనిట్ ఆగిపోవడంతో 210 మెగావాట్ల ఉత్పత్తి తగ్గింది. కాగా మిగిలిన యూనిట్లలో కూడా విద్యుత్‌ను తగ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఆదివారం రాత్రికి 800 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం విద్యుత్ ఉత్పత్తి మరింత పడిపోయే అవకాశం కనపడుతోంది.
రోడ్డెక్కిన ఎన్టీటీపీఎస్ ఉద్యోగస్తులు.....
వేతన సవరణకు ప్రభుత్వం తక్షణం అంగీకరించాలని కోరుతూ ఎన్టీటీపీఎస్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఇంజినీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. ఉదయం 6 గంటలకే మొదటి షిఫ్ట్ ఉద్యోగులందరూ ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. వీరితో అన్ని కార్మిక సంఘాలు కలిసి మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గవర్నర్ వేతన సవరణ ఒప్పందానికి అంగీకరించి కూడా ఇప్పుడు తమ సమస్య పరిష్కరించ కపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రెండో షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధుల్లోకి వెళ్లలేదు.
శనివారం అర్ధరాత్రి విధులకు వెళ్లిన సిబ్బందిని ఆదివారం ఉదయం టిఫెన్లు, భోజనాలు ఏర్పాట్లు చేసి ఆదివారం ఉదయమంతా అధికారులు పనిచేయించారు. అయితే ఆదివారం రాత్రి పనిచేయడానికి ప్లాంట్‌లో ఉన్న కార్మికులు అంగీకరించకుండా ఒకొక్కరే బయటకు వచ్చేశారు.
దక్షిణాది గ్రిడ్‌పై ఎఫెక్ట్..
ఎన్టీటీపీఎస్‌లో యూనిట్లు ట్రిప్ అయితే రాష్ట్రంలోని మిగిలిన థర్మల్ స్టేషన్లలో కూడా యూనిట్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే దక్షిణాది గ్రిడ్‌పై ఆ ప్రభావం పడి కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో అంధకారం అలముకునే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆందోళనపై గవర్నర్ సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఐక్యంగా సమ్మెను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎన్టీటీపీఎస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిఘా ముమ్మరం చేశారు.
నగరంలోనూ విద్యుత్ కోతలు....
ఇప్పటికే గ్రామాల్లో సుమారు 12 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులంతా సమ్మెలోకి దిగడంతో ఆదివారం రాత్రి విజయవాడ నగరంలోనూ చీకట్లు అలముకున్నాయి. సమ్మె మరింత తీవ్రమైతే గ్రామాలతో పాటు నగరాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నాలు....
విజయవాడ స్వరాజ్యమైదానం వద్ద ఉన్న విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సత్యానందం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్‌సీ ఇవ్వాలని లేకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.
సీమాంధ్ర ఉద్యమం మరవకముందే....
సీమాంధ్ర ఉద్యమం ముమ్మరంగా జరుగుతుండగా విద్యుత జేఏసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఎన్టీటీపీఎస్ ఇంజినీర్లు, కార్మికులు సమ్మెచేయడంతో మొత్తం ఉత్పత్తే ఆగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.