జిల్లాల పునర్విభజన ప్రతిపాదన మరోసారి తెరమీదకొచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనకు అతీతంగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్లు ఇప్పటికే బలంగా ఉన్నాయి.
సాక్షి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన ప్రతిపాదన మరోసారి తెరమీదకొచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనకు అతీతంగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్లు ఇప్పటికే బలంగా ఉన్నాయి. అనేక రకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన జరిగింది. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ ద్వారా మెరుగైన సేవలను అందించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది.
పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రమే పూర్తి స్థాయిలో జిల్లాల పునర్విభజన జరగలేదు. జిల్లా కేంద్రాలకు బాగా దూరంగా ఉన్న మండలాల నుంచి ప్రజలే కాకుండా అధికారులు ప్రతి అవసరానికీ అనేక వ్యయప్రయాలకోర్చి రావడం ఇబ్బందిగా ఉంటోంది. జిల్లా అధికారులు రోజువారీ వ్యవహారాలను పరిశీలించడం, క్షేత్ర పర్యటనలకు వెళ్లడం భారంగా మారుతోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆయా ప్రాంతాల ప్రజల నుంచి గట్టి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడున్న డిమాండ్ల మేరకు కొత్తగా ఏడెనిమిది జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలోనే 24 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఈ లెక్కన పునర్విభజన జరిగితే కరీంనగర్ జిల్లా రెండుగా విభజన జరిగే అవకాశం ఉంది. సిరిసిల్ల ప్రాంతంలోని మూడు మండలాలు సిద్దిపేట కేంద్రంగా ఏర్పడే జిల్లాలోకి వెళ్తాయని, మంథని నియోజకవర్గాన్ని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట భూపాలపల్లి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. అలాగే ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలతో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది.
ప్రస్తుతం 57 మండలాలతో 11 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కరీంనగర్ జిల్లా విస్తరించి ఉంది. జిల్లా కేంద్రం నుంచి మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, మహాముత్తారం మండలాలు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంతదూరం వెళ్లడం అధికారులకు, అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి రావడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. మంథని నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో కలిస్తే ఆ మండలాలు జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. పునర్విభజన జరిగితే పరిపాలనపరంగా సమస్య కొంత వరకు తీరుతుందన్న వాదన ముందుకు వస్తోంది. అలాగే కరీంనగర్ నుంచి కోరుట్ల 75 కిలోమీటర్లు, మెట్‌పల్లి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జగిత్యాల జిల్లా ఏర్పడితే ఈ రెండు ప్రాంతాల వారికి జిల్లా కేంద్రం 50కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలాగే సిద్దిపేట జిల్లా అయితే గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాల వారికి అతి దగ్గరగా, అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. అందరికీ సౌకర్యంగా, ఆమోదయోగ్యంగా జిల్లాల విభజన జరగాలన్న ఆలోచనతో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ప్రస్తుతం వినిపిస్తున్న ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. విభజన విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా చర్చలు జోరుగా సాగుతున్నాయి.
పజలకు, పాలనకు సౌలభ్యంగా ఉండే విధంగా విభజన కోసం విస్తృతంగా సంప్రదింపులు జరుగుతాయని నిఫుణులు చెప్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధితోనే జిల్లాలను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం భారీ కసరత్తు జరిగినందున కొత్తగా ఏర్పడిన శాసనసభ, లోకసభ నియోజకవర్గాల పరిధిపై అభ్యంతరాలు వచ్చే అవకాశాలు ఉండవన్నది వారి వాదన. ఈ ప్రాతిపదికన విభజన ఎంతవరకు సాధ్యమో పరిశీలించాల్సి ఉంటుంది.