సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్న యూపీఏ సర్కారు, కాంగ్రెస్ అధిష్టానంపై ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం రాజీలేని పోరు కొనసాగిస్తోంది. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట వీడినా... ప్రజలు, ఎన్‌జీఓలు మాత్రం సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఫలితంగా 78వ రోజైన బుధవారం కూడా జిల్లాలో ఆందోళన కొనసాగింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమ్మె కొనసాగించారు.
నగరంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, న్యాయవాదులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు రాళ్లు కొరుకుతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో రైతులు చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజుకు చేరాయి. వారికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతల మధ్య 1956 ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందంపై జేఏసీ ఆధ్వర్యంలో మాక్ ప్రదర్శన నిర్వహించారు.
పామిడిలో సమైక్యవాదులు మౌన దీక్ష చేశారు. కేంద్ర మంత్రుల కమిటీ ‘గోబ్యాక్’ అంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్‌లో ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో డివిజన్ పరిధిలోని మండల పరిషత్ నాలుగవ తరగతి ఉద్యోగులు ఒక్క రోజు సామూహిక దీక్ష చేపట్టారు. వీరికి పలువురు మద్దతు తెలిపారు.
కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు జల దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు, జీఓఎం సభ్యులను సీమాంధ్ర ద్రోహులుగా అభివర్ణిస్తూ... వారి చిత్రపటాలను జల సమాధి చేశారు. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు మద్దతు తెలిపారు. పెనుకొండలో జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టారు. స్థానిక జాతీయ రహదారిపై లారీలను నిలిపి శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్ష చేస్తున్న వారికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ప్రజాగర్జన నిర్వహించారు. రైతులు, ప్రజలు, సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి. యాడికిలో రెవెన్యూ ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బెళుగుప్పలో భిక్షాటన చేశారు. కూడేరులో పీహెచ్‌సీ వైద్యులు సమ్మెబాట పట్టడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. పామిడికి చెందిన మేదర రంగనాథ్ (45) బుధవారం టీవీలో సమైక్యాంధ్ర ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు.
అనంతాగ్రహం
Published Thu, Oct 17 2013 2:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement