పోలవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు హడావుడిగా సాగుతున్నాయి. ఈ నెల 15న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు దీనిని ప్రారంభించనుండటంతో అధికార యంత్రాంగం పనులను వేగవంతం చేసింది. అయినా ఆగస్టు 15 నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రెండు మోటార్లు, రెండు పంపులతో అయినా నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. హడావుడిగా చేస్తున్న ఈ పనుల్లో నాణ్యత లోపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 24 మోటార్లు, 24 పంపులతో 12 వరుసల పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఆగస్టు 15న మొదటి విడతగా 8 పంపుల నుంచి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించటంతో రాత్రి, పగ లు అనే భేదం లేకుండా పనుల్ని వేగవంతం చేశారు. 8పంపుల నుంచి నీరు విడుదల చేయటం సాధ్యం కాదని తేలిపోవడంతో అధికారులలో గుబులు మొదలైంది. ఎత్తిపోతల పథకం పోలవరం కుడి కాలువలో కలిసేచోట పైప్‌లైన్ ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. హెడ్‌వర్క్స్ పనులు మాత్రం కొలిక్కి రాలేదు. ఒక మోటార్, ఒక పంప్ ఫిట్టింగ్‌కు కాంక్రీట్ వేయాల్సి ఉంది. ఆదివారం ఉదయమే కాంక్రీట్ పనులు ప్రారంభించాలని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఐరన్ ఫిట్టింగ్ పనులు జరుగుతున్నాయి.
ఆగస్టు 15న నీరు విడుదల చేస్తారా?
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీటిని విడుదల చేస్తారా లేక లాంఛనంగా ప్రారంభించి వెళ్లిపోతారా అనేది రైతులకు తేల్చి చెప్పాలని సాగునీటి వినియోగ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు అయోమయంలో ఉన్నారని, రైతులకు పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. హడావుడిగా పట్టిసీమ పనులను చేయటం వల్ల పనుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హడావుడి పనులు.. నాణ్యతకు నీళ్లు!
Published Tue, Aug 11 2015 1:17 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement