‘భూ’గ్రహణం వీడేనా..!
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రవాణా రాజధానిగా, వాణిజ్య వాడగా భాసిల్లుతున్న విజయవాడకు అతి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి పట్టిన గ్రహణం వీడటంలేదు. భూసేకరణలో జాప్యం కారణంగా ఎన్నో ఏళ్లుగా ఈ విమానాశ్రయం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి విస్తరణకు అవసరమైన ప్రైవేటు భూమి సేకరణలో సాధ్యాసాధ్యాలపై మరోసారి చర్చ జరుగుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు రావటం.. కేంద్ర మంత్రివర్గంలో సీమాంధ్రకు చెందిన టీడీపీ నేత అశోక్‌గజపతిరాజుకు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి లభించడం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడ మధ్యే ఏర్పాటవుతుందని విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఈసారి జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
మొదట్లో మెత్తబడినా...
సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన 490 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి సర్వే నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి, అప్పారావుపేట, అజ్జంపూడి, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాల్లో 170 ఇళ్లు, సుమారు 300 మంది 490 ఎకరాల భూమిని కోల్పోతున్నారు. వీరికి పరిహారం విషయమై రైతులతో అధికారులు చర్చలు జరిపారు. గత పార్లమెంటు చివరి సమావేశాల్లో ఆమోదించిన భూసేకరణ బిల్లు ప్రకారం పరిహారం చెల్లిస్తేనే తమ భూములను అప్పగిస్తామని నిర్వాసితులు రెవెన్యూ అధికారులకు చెప్పారు.
కొత్త చట్టం ప్రకారం.. భూసేకరణ చేసే నాటికి ఉన్న ప్రభుత్వ, మార్కెట్ విలువలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఆ ప్రకారం మార్కెట్ విలువలు చెల్లిస్తామని చెప్పడంతో అప్పట్లో రైతులు మెత్తబడ్డారు. రైతులకు పరిహారం ఇవ్వటానికి దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమైంది. ఆ నిధులు లేకపోవటం, సార్వత్రిక ఎన్నికలు రావటంతో భూసేకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల ప్రకారం గత నాలుగు నెలల కన్నా భూముల మార్కెట్ విలువలు సగానికి సగం పెరిగాయి. బుద్ధవరం, దావాజీగూడెం తదితర గ్రామాల్లో నాలుగు నెలల కిందట ఎకరం రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ధర పలికాయి. ఇప్పుడు అక్కడ ఎకరం రూ.1.50 కోట్లకు చేరింది. దీంతో తక్కువ ధరలకు రైతులు తమ భూములను ఇవ్వటానికి ఇష్టపడటం లేదు.
అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే...
గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే అనేక మౌలిక వసతులు అత్యవసరం కానున్నాయి. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో అరకొర వసతులతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర పట్టణాలకు ఐదు విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం రన్‌వేను విస్తరించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న 7,500 మీటర్ల రన్‌వేను 10,500 మీటర్లకు పెంచాల్సిన అవసరం ఉంది.
రన్‌వేను విస్తరిస్తే బోయింగ్ విమానాలు దిగటానికి అవకాశం ఉంటుంది. రన్‌వే విస్తరించడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ వద్ద నిధులున్నా భూమి లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. కొత్తగా టెర్మినల్ భవనం, కార్ పార్కింగ్, క్యాంటీన్, విమానాలు నిలిపే స్థలం ఏర్పాటు, రోడ్లు నిర్మించాల్సి వస్తుంది. భూసేకరణ సమస్యను అధిగమిస్తేనే ఇవన్నీ సాధ్యమనే విషయం గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.