కర్నూలు హాస్పిటల్ : కుటుంబ సంక్షేమంలో స్త్రీ, పురుషులు అత్యంత కీలకం. అయితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో మాత్రం పురుషులు ముందుకు రావడంలేదు. ఆపరేషన్ల(వేసెక్టమీ)లో ఆధునిక పద్ధతులు వచ్చినా పురుషులు వెనుకడుగు వేస్తున్నారు. తొమ్మిది నెలలు మోసి, ప్రసవించిన స్త్రీలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పడంలేదు. ప్రసవ సమయాల్లో సిజేరియన్లు జరిగినా.. కు.ని. ఆపరేషన్లకు పురుషులు మాత్రం ముందుకురావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే మహిళలకు రూ.800, పురుషులకు రూ.1100 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహక నగదు ఇస్తుంది. అయినా వేసెక్టమీ ఆపరేషన్లలో మాత్రం జిల్లా అట్టడుగున ఉంది. ప్రభుత్వం నుంచి సరైన ప్రచారం లేకపోవడంతో వేసెక్టమీ ఆపరేషన్ల నమోదు దారుణంగా పడిపోతోంది.
వేసెక్టమీ ఆపరేషన్‌లో మార్పులెన్నో..
పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వేసెక్టమీ)లో గతంలో కోత ఉండేది. ఇప్పుడు ఆధునిక పద్ధతులు అమలులోకి వచ్చాయి. శిక్షణ పొందిన వైద్యులు ఉన్నారు. వసతులు ఉన్నాయి. ఆసుపత్రులకు వచ్చే పురుషులకు రెండు నుండి ఐదు నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్ చేస్తారు. గంటలోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్చు. ఆపరేషన్ చేయించుకున్న పురుషులకు ప్రభుత్వం రూ.1100 ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని పనులు సక్రమంగా చేసుకోవచ్చు. బరువు ఎత్తవచ్చు. అయినా పురుషులు అపోహలతో వెనుకంజ వేస్తున్నారు.
ప్రచారం లేదు.. అవగాహన లేదు..
కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ నియంత్రణ పద్ధతులను వివరించడంలో విఫలమవుతోంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ల వైపే ప్రాధాన్యత చూపుతున్న యంత్రాంగం వేసెక్టమీ ఆపరేషన్లపై పురుషులకు అవగాహన కల్పించడంలో వెనుకబడిందని చెప్పవచ్చు.
ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం నుండి ప్రచారం లేకపోవడం, ప్రత్యేక క్యాంపులు, ప్రోత్సాహకాలు లేకపోవడం తదితర కారణాల వల్ల పురుషులకు ఆపరేషన్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కుటుంబ నియంత్రణ పద్ధతులను వివరిస్తున్న ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రికార్డుల్లో నమోదు కోసం సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. స్త్రీలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. వారికే అవగాహన కల్పిస్తున్నారు.
పదేళ్లలో గణనీయంగా తగ్గిన ఆపరేషన్లు
జిల్లాలో గత పదేళ్ల కాల వ్యవధిలో వేసెక్టమీ ఆపరేషన్లు గణనీయంగా తగ్గాయి. ఎటువంటి లక్ష్యాలు, ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోవడంతో జిల్లాలో వందల సంఖ్యలో నుండి పదుల సంఖ్యకు చేరుకోవడం గమనార్హం. 2008లో 166 వేసెక్టమీ ఆపరేషన్లు నమోదు కాగా, 2013-14లో రెండు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క వేసెక్టమీ ఆపరేషన్ కూడా నమోదు కాకపోవడం విశేషం.
వేసెక్టమీ సులువైన ఆపరేషన్..
వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. నోస్కాలెపెల్ వ్యాసెక్టమీ(ఎన్‌ఎస్‌వి) ఆపరేషన్ పదేళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. అయినా పురుషుల నుండి స్పందన లేదు. కత్తి లేకుండా చేసే ఆపరేషన్‌లో కోత, కుట్లు ఉండవు. ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. విస్తృతంగా ప్రచారం కల్పించాలి. పురుషులకు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దీనిపై యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
- డాక్టర్ మాణిక్యరావు, గర్భిణీ, స్త్రీవ్యాధుల నిపుణులు,
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల
ఒక్క మగాడు.. లేడు..!
Published Sat, Dec 20 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement