
నెల్లూరు(సెంట్రల్): వారంతా నిరుపేదలు. నివేశన స్థలాలు లేక సుమారు 30 ఏళ్లుగా రైల్వే పట్టాల పక్కన చిన్నపాటి ఇళ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి అధికారులు రోడ్లు, కుళాయి, విద్యుత్ కనెక్షన్లు సైతం మంజూరు చేశారు. ఇళ్ల పన్నులను సైతం వసూలు చేస్తున్నారు. రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణ పనులు ప్రారంభించడంతో పట్టాల పక్కన నివాసం ఉంటున్న వారందరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైల్వే అధికారులు ఎప్పుడు నివాసాలను ఖాళీ చేయిస్తారో..ఎక్కడికి వెళ్లాలోనని ఆందోళన చెందుతున్నారు.
మూడో లైన్ పనులు ప్రారంభం
విజయవాడ నుంచి చెన్నై వరకు రైళ్ల రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ మూడో లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలో కావలి నుంచి తడ వరకు సుమారు 170 కిలోమీటర్ల పొడవున మూడో రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నారు. తొలుత నదులపై బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించిన రైల్వే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు పెన్నా నది వద్ద మూడో లైన్ కోసం బ్రిడ్జి పనులను ప్రారంభించారు.
నిరాశ్రయుల పరిస్థితి ఏమిటి!
జిల్లాలో కావలి నుంచి తడ వరకు రైల్వే పట్టాల సమీపంలో సుమారు 15 వేల కుటుంబాలకుపైగా నివాసం ఉంటున్నాయి. 30 ఏళ్లుగా చిన్నపాటి నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పన్నులను చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. రైల్వేశాఖ మూడో లైన్ నిర్మాణ పనులు ప్రారంభించడంతోఏ సమయంలో తమ ఇళ్లను కూల్చేస్తారోనని పేదలు నిత్యం ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల త రబడి నివాసం ఉంటున్న తమకు ప్రత్యామ్నా యం చూపించకుండా పోలీసు బలగాలను ప్ర యోగించి నివాసాలను నేలకూల్చితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాధానం చెప్పడం లేదు
మూడో లైను పనులు ప్రారంభిస్తున్న రోజున రైల్వే అధికారులను కలిశాం. పట్టాల పక్కన నివసించే వారి పరిస్థితి ఏమిటి, వారికి ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారాని అడిగినా స్పందన లేదు. ఎంతో మంది కొన్నేళ్లుగా పట్టాల పక్కన నివాసం ఉంటున్నారు. వారికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. –దేవరకొండ అశోక్, 53వ డివిజన్ కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment