సాక్షి, నిజామాబాద్: ధాన్యం కొనుగోళ్ల లో తలెత్తిన హమాలీల సమస్యను అధిగమించడం అధికార యంత్రాంగానికి సంక్లిష్టంగా మారింది. మహారాష్ట్ర, బీహార్ నుంచి వచ్చే ఈ వలస కూలీలను జిల్లాలోనికి అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన ప రిస్థితి నెలకొంది. ప్రతి సీజనులో వందల సంఖ్యలో వచ్చే వీరిని ఇప్పుడు జిల్లాలోకి అనుమతిస్తే కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. పైగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చే హమాలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ విస్తరించే అవకాశాలుంటాయి. మరోవైపు అవసరమైన మేరకు హమాలీలు లేక జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆశించిన మేరకు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ హమాలీలను అనుమతించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే జిల్లాలోకి అనుమతించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశించారు.
రైసుమిల్లులోనూ ఇదే పరిస్థితి..
ప్రతి సీజనులో మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి హమాలీలు వందల సంఖ్యలో జిల్లాకు వస్తుంటారు. ధాన్యం బస్తాల్లో నింపడం.. తూకం.. లోడింగ్.. అన్‌లోడింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద కనీసం 12 మంది హమాలీలు ఉంటారు. ఎక్కువ మొత్తంలో ధాన్యం వచ్చే కేంద్రాల్లో 20 మంది వరకు పనిచేస్తుంటారు. గ్రూపులు.. గ్రూపులుగా వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేస్తుంటారు. ఇలా జిల్లాలో ఏర్పాటు చేయనున్న 250 పైగా కొనుగోలు కేంద్రాల్లో సుమారు రెండు వేలకు పైగా హమాలీలు వస్తుంటారు.
అలాగే రైసుమిల్లుల్లోనూ హమాలీల అవసరం ఉంటుంది. ఒక్కో మిల్లులో సుమారు 25 నుంచి 40 మంది పనిచేస్తుంటారు. సీజను ముగిసేదాక ఇక్కడే ఉండి సీజను ముగిసాక సొంత గ్రామాలకు వెళ్లిపోతుంటారు. ఈసారి లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన హమాలీలు జిల్లాకు చాలా మట్టుకు రాలేకపోయారు. ఇప్పుడు వీరిని జిల్లాకు తీసుకురావాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రతి వ్యక్తికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే జిల్లాలోకి అనుమతించాలని భావిస్తోంది.
మందకోడిగా కొనుగోళ్లు..
హమాలీల సమస్య కారణంగా కేంద్రాల వద్ద తూకాలు ఆలస్యమవుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు, ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులే స్థానికంగా ఉండే కూలీలతో లోడింగ్.. కాంటా పనులు చేయిస్తున్నారు. వీరికి సరైనా అనుభవం లేకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment