కర్రలు, గొడ్డళ్లు, బాంబులతో దాడి
Published Thu, Aug 22 2013 2:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
కంచరగుంట (దుర్గి), న్యూస్‌లైన్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కక్ష పెంచుకొని బాంబులు, గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసిన సంఘటన కంచరగుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో బాలిక తండ్రి మరణించాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నెల రోజుల కిందట గ్రామానికి చెందిన శ్రీపతి చెన్నయ్య(42) కుమార్తె పట్ల అదే గ్రామానికి చెందిన చవ్వాకుల మస్తానయ్య కుమారుడు శ్రీనివాసరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీనిపై చెన్నయ్య దుర్గి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇరువర్గాల పెద్దలు రాజీ కుదుర్చి శ్రీనివాసరావుతో క్షమాపణ చెప్పించారు. కక్ష పెంచుకున్న శ్రీనివాసరావు వర్గీయులు పది మంది బుధవారం మధ్యాహ్నం చెన్నయ్య పొలంలో పురుగు మందు పిచికారి చేస్తుండగా గొడ్డళ్లు, కర్రలు, బాంబులతో దాడి చేశారు. పక్క పొలంలో ఉన్న శ్రీపతి శ్రీను, కొండలు గమనించి కేకలు వేయడంతో వారిపైనా దాడి చేశారు.
చుట్టుపక్కలవారంతా అక్కడికి చేరుకోవడంతో శ్రీనివాసరావు వర్గీయులు ఆయుధాలు అక్కడ పడేసి పరారయ్యారు. గాయపడిన చెన్నయ్య, శ్రీను, కొండలును ప్రైవేటు వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చెన్నయ్య మృతి చెందారు. తీవ్రగాయాలైన శ్రీనును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రూరల్ ఎస్పీ జె. సత్యనారాయణ, గురజాల డీఎస్పీ ఇంజారపు పూజ పరిశీలించారు. తొమ్మిది మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Advertisement