ఆరిపోయిన చిరుదివ్వెలు | Three die in road accident | Sakshi
Sakshi News home page

ఆరిపోయిన చిరుదివ్వెలు

Published Sun, Apr 1 2018 10:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Three die in road accident - Sakshi

ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. ఎన్నో ఆశలతో సుదూరంలో ఉన్న బడికి పంపిస్తున్న వారి కలలన్నీ కల్లలయ్యాయి. తాము నిరుపేదలమైనా.. తమ పిల్లలు చదివి బాగుపడాలన్న వారి ఆకాంక్షలు ఆదిలోనే నీరుగారిపోయాయి. ప్రాథమికోన్నత పిల్లలకు ఉచిత రవాణా సదుపాయం అంటూ చెప్పిన ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వారి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. బస్సుల్లో పిల్ల లను ఎక్కించుకోకపోవడం... ఉన్న బస్సుల్ని రద్దు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వేరే మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం ఆ కుటుంబాల్లో కడుపుకోతకు కారణమయ్యాయి. ఒంటిపూట బడి ముగించుకుని ఇంటికి చేరేందుకు లిఫ్ట్‌ అడిగి వెళ్తున్న బైక్‌ కాస్తా ఓ బస్సును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. వారిని తీసుకెళ్తున్న ఆ యువకుడి ప్రాణాలు సైతం గాలిలో కలసిపోయాయి.

శృంగవరపుకోట రూరల్‌: ఒంటి పూట బడులు. మధ్యాహ్నం 12.30 అయింది. బడి వదిలేశారు. ఆకలి వేస్తోంది. వెంటనే ఇంటికి చేరాలి. అమ్మచేతిముద్ద తినాలి. కాస్తంత సేద తీరాలి. మళ్లీ హోం వర్క్‌కు సిద్ధం కావాలి. ఇదే ధ్యాసతో బయలుదేరిన ఆ పిల్లలకు బస్సులు దొరకలేదు. తమతమ గ్రామాలకు వెళ్లాల్సిన బస్సు ఇక రాదని తెలుసుకుని అటుగా బైక్‌పై వెళ్లేవారిని కాస్త ఎక్కించమని బతిమి లాడారు. ఓ అన్న వారిని ఎక్కిం చుకున్నాడు. కానీ అదే వారి ప్రా ణాలు బలిగొంటుందని వారస్సలు ఊహించలేదు. కాసేపట్లోనే వా రు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సం ఘటన ఎస్‌కోట మండలం కొత్తూరు–వెంకటరమణపేట గ్రామాల మధ్య శనివారం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

ఎలా జరిగిందంటే...
భోగాపురం మండలం నందిగాం పోస్టు సబ్బన్నపేటకు చెందిన మల్లాడ గౌరీశేఖర్‌(22) విజయనగరం ఎల్‌జీ సర్వీస్‌ సెంటర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌.కోట పట్టణం నుంచి వచ్చిన ఓ కంప్లయింట్‌ను పరిష్కరించేందుకు వచ్చిన ఆ యువకుడు అక్కడి పని పూర్తి చేసుకుని కొత్తవలసలో మరో చోటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో లక్కవరపుకోట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చప్పగడ్డి విజయ్‌(6వ తరగతి), గొర్లె లోకేష్‌ (7వ తరగతి) బడి విడిచిపెట్టాక ఇంటికి వెళ్లేందుకు శృంగవరపుకోట బస్టాండుకు సమీపంలో లిఫ్ట్‌ అడిగారు. వారిని ఎక్కిం చుకున్న గౌరీశేఖర్‌ బైక్‌ కొత్తూరు–వెంకటరమణపేట గ్రామాల మధ్య ముందుగా వెళ్తున్న ఆటోను ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టడంతో బైక్‌ను బస్సు కొద్ది దూరం ఈడ్చుకుని పోయింది. 

ఈ ప్రమాదంలో బైక్‌ పై కూర్చున్న ముగ్గురి తలలు, ఇతర శరీర భాగాలు రోడ్డుకు బలంగా తాకటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మల్లాడ గౌరీశేఖర్‌ తలకు హెల్మెట్‌ ధరించినప్పటికీ ఆర్టీసీ బస్సు, బైక్‌ ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో హెల్మెట్‌ పక్కనే గల తుప్పలోకి ఎగిరిపోగా గౌరీశేఖర్‌ తల రోడ్డుకు గుద్దుకోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్‌ నుజ్జు నుజ్జయ్యింది. ఇదిలా ఉండగా ఎస్‌.కోట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి ఎస్‌.కోట వైపు అతివేగంగా వస్తూ ఈ బైక్‌ను ఢీకొందని మరికొంత మంది ఆరోపిస్తున్నారు.

హుటాహుటిన మృతదేహాల తరలింపు
మృతిచెందిన చప్పగడ్డి విజయ్‌కు 9వ తరగతి చదువుతున్న సోదరుడు అజయ్, తల్లి కాంత, తండ్రి రమణ ఉండగా.. గొర్లె లోకేష్‌కు ఎల్‌.కోట హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న జానకి అనే సోదరి, తల్లి వెంకటలక్ష్మి, తండ్రి రామారావు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకోవటంతో ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసు సిబ్బంది శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్‌.కోట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.రవి, ఎస్‌.కోట ఆర్టీసీ డిపో మేనేజర్‌ నాగార్జునరాజుతో కలిసి విజయనగరం డీఎస్పీ ఏ.వి.రమణ పరిశీలించారు. మృతదేహాలను ఎస్‌.కోట ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, డీఎస్పీ ఏ.వి.రమణ, ఎంఈఓ బి.అప్పారావు ఓదార్చారు. సీఐ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరివీ వ్యవసాయ కుటుంబాలే...
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మల్లాడ గౌరీశేఖర్‌(22), చప్పగడ్డి విజయ్‌(11), గొర్లె లోకేష్‌ (12)లు ముగ్గురూ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. గౌరీశేఖర్‌ రోజూ స్వగ్రామమైన భోగాపురం మండలం సబ్బన్నపేట గ్రామం నుంచి విజయనగరంలోని ఎల్‌జీ సర్వీస్‌ సెంటర్‌కు ద్విచక్రవాహనంపై వచ్చి వెళ్తుంటారు. సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకుల ఆదేశాల మేరకు ఎల్‌ఈడీ టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటివాటికి మరమ్మతులు చేసేందుకు వివిధ గ్రామాలకు వెళ్తుంటాడు. తండ్రి సన్యాసిరావు తాపీ మేస్త్రీ కాగా, అన్న నాగరాజు వెల్డర్‌. విద్యార్థి చప్పగడ్డి విజయ్‌ ఎస్‌కో ట పట్టణంలోని రామన్‌ ప్రైవేట్‌ స్కూల్లో 6వ తరగతి, గొర్లె లోకేష్‌ ఎస్‌.కోట పట్టణంలోని శ్రీ రవిజేత హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. రోజూ ఎల్‌.కోట మండలంలోని సీతారాంపురం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు.

ఆర్టీసీ బస్సు ఎక్కించకే...
బస్సు పాసులు ఉన్నప్పటికీ విద్యార్థులను సక్రమంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించటం లేదనీ, విద్యార్థులు చేతులు ఎత్తి ఆపుతున్నా స్టాపుల్లో ఆపకుండా బస్సులు వేగంగా వెళ్లి పోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు విద్యార్థులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో చదువుతున్న స్కూళ్లకు సమయానికి వెళ్లి తిరిగి ఇళ్లకు వచ్చే క్రమంలో విద్యార్థులు అటు వైపుగా ప్రయాణిస్తున్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను బాగా చదివించి వారి జీవితాలను ఉన్నతంగా ఉంచాలనే ఆశయంతో ఎస్‌.కోట పట్టణంలోని కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివిస్తున్నామని, చివరికి రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను మింగేసిందంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల తీరు అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది. 

సీతారాంపురంలో అలుముకున్న విషాదఛాయలు
లక్కవరపుకోట: అరకు–విశాఖ రోడ్డులోని ఎస్‌.కోట మండలం వెంకటరమణపేట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్కవరపుకోట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో చలాకీగా ఉంటూ... అందరి తలలో నాలుకలా ఉండే పిల్లలు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు బోరుమంటూ విలపించారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో తిప్పి ఉంటే తమ పిల్లలు బతికేవారని వారంతా గుండెలు బాదుకుని రోదిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement