కమలాపురం: ఒకటి.. రెండు.. మూడు.. ఇవి అంకెలు కాదు.. ఒకే రోజు కమలాపురంలో జరిగిన వరుస దాడులు... ఎన్నడూ లేని విధంగా ఈ సంఘటనలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం పోలీసుల కళ్లుగప్పి నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకున్న సునీల్ అప్పుడు పంజా విసరడం మొదలు పెట్టాడా..! పోలీసులకు మళ్లీ చిక్కేలోపు వీలైనంత త్వరగా దాడులు నిర్వహించి అందిన కాడికి దోచుకోవాలని భావించాడా.. వరుసదాడులను పరిశీలిస్తే నిజమేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి.
వివరాల్లోకెళితే.. ముద్దనూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కమలాపురం వద్ద తమ స్విఫ్ట్ కారును నిలబెట్టుకుని నిద్రించసాగారు. ఇంతలో ఇద్దరు దుండుగులు అక్కడికి వచ్చి తాము ఐడీ పార్టీ పోలీసులమని, మీ కారులో ఎర్రచందనం ఉందని తమకు ఫిర్యాదు వచ్చిందని, కారు దిగాలని కోరారు. దీంతో కారు యజమానికి, వారికి మాటా మాటా పెరిగింది. దండగులు కారు యజమానిపై దాడి చేసి వెళ్లిపోయారు. కారు యజమాని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కమలాపురం పోలీసులు బాధితులతో కలసి కడప వైపు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా కడప ఎయిర్‌పోర్ట్ వద్ద దుండుగులు వదిలి వెళ్లిన పల్సర్ వాహనం దొరికింది. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిత్తూరుకు చెందిన కరివేపాకు వ్యాపారి చెంగయ్య లగేజ్ ఆటోలో కడప నుంచి తాడిపత్రి వెపు వెళ్తుండగా.. ఆ ఆటోను నిలిపిన దుండుగులు కమలాపురం వరకు వచ్చారు. అప్పటికే వైఎస్‌ఆర్ సీపి కార్యాలయం వెనుకవైపు ఒమిని కారులో ఉన్న మరో ఐదుగురు కలసి చెంగయ్యతో పాటు డ్రైవర్‌పై దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ. లక్షను దోపిడీ చేసి వారి చేతులు కట్టేసి కడప-తాడిపత్రి హైవేలోని గొళ్లపల్లె వంక వద్ద పడేశారు. తెల్లవారుజామున 2-3గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని బాధితులు తెలిపారు.
కలకలం రేపిన డాక్డర్ గణేష్ కిడ్నాప్
పట్టణంలోని సొసైటీ కాలనీలో దాదాపు 25ఏళ్ల క్రితం నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ప్రైవేట్ డాక్టర్ గణేష్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. తెల్లవారు జామున 4గంటలకు లగేజీ ఆటోలో నలుగురు వ్యక్తులు డాక్టర్ ఇంటి వద్దకు వచ్చి పేషెంట్‌కు సీరియస్‌గా ఉందని రావాలని కోరారు. దీంతో డాక్టర్ గణేష్ వారి వెంట వెళ్లారు. అంతలోనే సీనీ ఫక్కీలో డాక్టర్ నోటికి ప్లాస్టర్ అంటించి కిడ్నాప్ చేశారు. కాగా ఐదు గంటల ప్రాంతంలో మరో పెషెంట్ వచ్చారు. డాక్టర్ కిందనే ఉన్నారని ఆయన భార్య చెప్పడంతో కిందికి వెళ్లి చూశారు. డాక్టర్ కనిపించలేదు. దీంతో డాక్టర్ కిడ్నాప్‌కు గురయ్యాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల రంగ ప్రవేశంతో..
పట్టణంలో సంచలనం రేకెత్తించిన డాక్టర్ గణేష్ కిడ్నాప్ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ అశోక్ కుమార్ కమలాపురం నుంచి వెళ్లే అన్ని రూట్లలో పోలీసు నిఘా పెంచారు. సీఐ మొదలుకుని పోలీసు సిబ్బంది సివిల్ డ్రస్‌లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఎక్కడ దొరికిపోతామోనని భావించిన నిందితులు డాక్టర్‌ను వదిలేశారు.
రూ. కోటి అడిగారు
తనను వదిలేందుకు కిడ్నాపర్లు రూ. కోటి డిమాండ్ చేశారని డాక్టర్ గణేష్ తెలిపారు. తన వద్ద అంత డబ్బు లేదని రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పానన్నారు. చివరకు డాక్టర్ వద్ద ఉన్న బంగారు చెయిన్, ఉంగరాలు, బ్రాస్‌లెట్ తీసుకుని ఇర్కాన్ సర్కిల్ వద్ద వదిలేశారు. అక్కడి నుంచి డాక్టర్ ఆటోలో ఇంటికి వచ్చారు. ఇదిలా ఉండగా డాక్టర్ గణేష్‌ను కిడ్నాపర్లు తీవ్రంగా గాయపరిచారు. డబ్బు తేవాలని కోరినప్పుడు డాక్టర్ రాంగ్‌నంబర్‌కు ఫోన్ చేయడంతో వారు దాడి చేశారు.
భయాందోళనలో ప్రజలు
ఒకేసారి వరుసగా మూడు దాడులు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డాక్టర్‌ను కిడ్నాప్ చేశారనే సమాచా రం దావానంలా వ్యాపించడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ విషయంపై డీఎస్పీ అశోక్ కుమార్‌ను వివరణ కోరగా డాక్టర్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తామని తెలిపారు. ఇది సునీల్ గ్యాంగ్ పనేనా అని అడిగిన ప్రశ్నకు డీఎస్పీ స్పందిస్తూ ఆ కోణంలో కూడా విచారణ చేపడతామన్నారు.
ఒకే రోజు మూడు వరుస దాడులు
Published Mon, Dec 15 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement