నీరుగారుతున్న నిర్మాణం
విజయనగరం మున్సిపాలిటీ: పాలకులు మారినా..అధికారులు వచ్చి పోతున్నా..పట్టణ ప్రజల దాహార్తి మాత్రం తీరడం లేదు. జిల్లా కేంద్రంలో గల 3 లక్షల మంది ప్రజలు కొన్నేళ్లుగా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేకపోవడం దారుణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వాటిని వినియోగించుకోవడంలో ఇంజినీరింగ్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు ఆదిశగా ప్రయత్నాలు సాగించిన దాఖలాలు లేవు. దీంతో ఈఏడాదీ వేసవిలో పట్టణప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పనలవిగా మారాయి.
మూడేళ్లుగా నిర్మాణంలో మూడు రక్షిత మంచి నీటి పథకాలు
విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న ప్రజల దాహర్తిని తీర్చేందుకు పట్టణంలోని వ్యాసనారాయణమెట్ట, ఫూల్‌భాగ్‌కాలనీ, మయూరి జంక్షన్ ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాల నిర్మాణాలు చేపట్టాలని మూడేళ్ల క్రితమే నిర్ణయించారు. ఇందులో భాగంగా వ్యాసనారాయణమెట్ట, పూల్‌బాగ్‌కాలనీతో పాటు మయూరి జంక్షన్ వద్ద నిర్మించతలపెట్టిన నీటి పథకాలకు సుమారు రూ450కోట్లు నిధులు మంజూరు చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా వాటి నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతూనే ఉంది. రూ.96 లక్షల వ్యయంతో వ్యాసనారాయణమెట్ట ప్రాంతం 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచి నీటి పథకం మార్చి నాటికి పూర్తివు తుందని అధికారులు చెబుతున్నారు. అయితే మయూరి జంక్షన్ తదితర ప్రాంతాల్లో నిర్మించాల్సిన రక్షిత మంచి నీటి పథకాలు మాత్రం విశాఖలో గల పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాయి. అయితే ముందుగా పనులు చేపట్టిన సదరు కాంట్రా క్టర్‌లు ట్యాంక్ నిర్మాణం మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు. దీంతో ఆ రెండు పథకాల నిర్మాణ ప్రగతి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా మారింది.
కలగా మిగిలిపోతున్న ప్రతి రోజూ నీటి సరఫరా...
పట్టణ ప్రాంతాలో నివసిస్తున్న ప్రజలు ప్రతి రోజు తాగు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకంటామని వచ్చే పాలకులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చటం లేదు. పట్టణంలో వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే సాధారణ రోజుల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంటుంది.ఈ మూడు రక్షిత మంచి నీటి పథకాల నుంచి 16 ఎంఎల్‌డి నీరు పట్టణానికి వస్తుంటుంది. ఇది కూడా నెల్లిమర్ల, రామతీర్ధం, ముషిడిపల్లి రక్షిత మంచి నీటి పథకాల వద్ద నుంచి ఆశించిన స్థాయిలో నీరు పంపింగ్ జరిగినపుడే సాధ్యపడుతుందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వేసవి కాలంలో పట్టణానికి నీటిని అందించే మూడురక్షిత మంచి నీటి పథకాల వద్ద ఊటబావుల్లో నీటి మట్టాలు తగ్గిపోయే పరిస్థితిలు ఏటా చవి చూస్తున్నారు. దీంతో ఆ సమయంలో అధికారులు మూడు రోజులకు ఒక మారు నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా వేళపాళలేకుండా మండుటెండలో మిట్టమధ్యాహ్నం సమయాల్లో, అర్ధరాత్రి అంతా పడుకునే సమయాల్లో నీటిని సరఫరా చేస్తున్నారు.
దీంతో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడుతూనే ఉన్నారు. ఇదే విషయమై మున్సిపల్ డీఈ మత్స్యరాజును సాక్షి వివరణ కోరగా..పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వ్యాసనారాయణమెట్ట రక్షిత మంచినీటి పథకం పనులు మార్చి నెలలోగా పూర్తవుతాయన్నారు. మిగిలిన పథకాలకు సంబంధించిన పనులును పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారని తమకు సంబంధం లేదన్నారు. వేసవిలో పట్టణ ప్రజల తాగు నీటిని తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించచామనని చెప్పారు.