మాజీ భార్యపై కత్తితో దాడి చేసినట్లుగా కృష్ణలంక పోలీసులు దాఖలు చేసిన కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్షతో
విజయవాడ లీగల్: మాజీ భార్యపై కత్తితో దాడి చేసినట్లుగా కృష్ణలంక పోలీసులు దాఖలు చేసిన కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.1,000 జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ జడ్జి జి.అనుపమ చక్రవర్తి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన నిందితుడు చింతపల్లి వెంకటేశ్వరరావుకు, విజయనగరానికి చెందిన నాగమణితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారిద్దరూ ఉపాధి కోసం విజయవాడ నగరానికి వచ్చేశారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. నాలుగేళ్ల కిందట ఫిర్యాది భర్తపై వరకట్నం, వేధింపులపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది.ఆ కేసును విచారించిన కోర్టు నిందితునిపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధించింది. అనంతరం ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. కాగా, మాజీ భార్య తనకు శిక్ష వేయించిందని కోపం పెంచుకున్న నిందితుడు ఆమెపై పగ తీర్చుకునేందుకు పథకృ పన్నాడు.
2013 జూలై 17న నాగమణి పనిచేస్తున్న వస్త్ర దుకాణం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా వెంబడించాడు. ఆమె యింటికి వెళ్లి కింద పోర్షన్‌లో అద్దెకుంటున్న వారిని అడగ్గా వారు కేకలు వేయడంతో పారిపోయాడు. విషయం తెలుసుకున్న నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తుండగా కాపు కాచి కత్తితో ఆమెపై దాడి చేశాడు.ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.కోర్టు విచారణలో నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.