తొలిరోజు ఆంగ్లానికి బదులు ద్వితీయ భాష పరీక్షలు'
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షల టైంటేబుల్‌లో మార్పులు చేసినట్లు బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదట జారీ చేసిన షెడ్యూలు ప్రకారం మార్చి 12వ తేదీన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిషు పరీక్ష, 13వ తేదీన ద్వితీయ సంవత్సర ఇంగ్లిషు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దీన్ని మార్పు చేశారు. 12వ తేదీన ప్రథమ సంవత్సర ద్వితీయ భాష పరీక్షను, 13వ తేదీన ద్వితీయ సంవత్సర ద్వితీయ భాష పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. ప్రథమ సంవత్సర ఇంగ్లిషు పరీక్షను 14వ తేదీన, ద్వితీయ సంవత్సర ఇంగ్లిషు పరీక్షను 15వ తేదీన నిర్వహిస్తామని వివరించారు. మిగతా పరీక్షలు షెడ్యూలు ప్రకారం యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. గ్రామీణ విద్యార్థుల్లో ఆందోళనను తొలగించేందుకు తొలిరోజు ఇంగ్లిషు పరీక్షను సవరిస్తూ బోర్డు మార్పు చేసింది.