
సాక్షి, తిరుమల: సూర్య గ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి పోయా కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 22 గంటలు పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.