వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అభిప్రాయపడ్డారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి ఎన్.చంద్ర బాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విజయకుమార్ మాట్లాడారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమల అభివృద్ధిపై చర్చించారు.
వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని, ముఖ్యంగా అనుబంధ రంగాలపై మత్స్య, పాడి కోళ్లపెంపకం పరిశ్రమల విస్తరణ జరగాలని సూచించారు. అనంతరం జరిగిన చర్చలో కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సంబంధించి పొగాకుతో పాటు ఉద్యాన పంటలు, పాల ఉత్పత్తి పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి మైనింగ్, క్వారీయింగ్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం జిల్లాలో చేపట్టిన చర్యలు వివరించారు. సమావేశంలో జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ఐపీఎస్ అధికారుల సమావేశానికి ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ కూడా హాజరయ్యారు.