నెలాఖరుకు మద్యం షాపులు సిద్ధం!
- 94 చోట్ల దుకాణాలు
- కొనసాగుతున్న కమిటీల నియామకం
విశాఖపట్నం : జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కమిటీల నియమిస్తోంది. జిల్లా కలెక్టర్ మూడు కమిటీలను నియమించిన వెంటనే మద్యం షాపులు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుంది. అం దుకు అవసరమైన కసరత్తును ఎక్సైజ్ శాఖ వేగంగా జరుపుతోంది.
మద్యం దుకాణాల అద్దె నిర్ణయించేందుకు, ఆ దుకాణాల్లో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు, దుకాణాలకు కావల్సిన మద్యం సరఫరా చేసేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను సమకూర్చేందుకు కమిటీలను నియమిస్తున్నారు. వచ్చే వారంలోగా కమిటీల నియామకం పూర్తి చేస్తే ఆ తదుపరి కార్యక్రమాలను వేగంగా చేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిం ది. సెప్టెంబర్ నెలాఖరుకు ఈ దుకాణాలు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశాఖలో 94 చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. నగర సమీప ప్రాంతాలైన అనకాపల్లి, గాజువాక, పెందుర్తి, సబ్బవరం, భీమిలి ఎక్సైజ్ సర్కిల్స్‌లోనే ఈ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవనున్నారు. ఈ దుకాణాలన్నీ ఏర్పాటు చేస్తే దాదాపు 400 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభ్యమయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది విశాఖలో 14 చోట్ల మద్యం దుకాణాలు నెలకొల్పగా ఈ సారి భారీగా దుకాణాలు ఏర్పా టు చేయడం పెద్ద కసరత్తుగానే అధికారులు పరిగణిస్తున్నారు.
రాష్ట్రంలోని మరే జిల్లాలోనూ 94 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే చాన్స్ లేదు. జిల్లాలో 406 మద్యం దుకాణాలకు 312 దుకాణాలు మాత్రమే టెండర్ ద్వారా ఏర్పాటయ్యాయి. మిగిలిన వాటిని ప్రభుత్వ మద్యం ఔట్‌లెట్‌లుగా త్వరలోనే ప్రారంభించేందుకు అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ కావడంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎక్సైజ్‌శాఖలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు.