
నెహ్రూ అడుగుజాడల్లో నడవాలి
శ్రీకాకుళం అర్బన్ : శాంతిదూతగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తత్వవేత్తగా ఖ్యాతినార్జించిన భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అడుగుజాడల్లో బాలలు నడవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ సమకాలీకుడిగా, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి దేశాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. నెహ్రూకి గులాబీలన్నా, చిన్నారులన్నా ఎంతో ఇష్టమన్నారు.
అందుకే నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, ఎన్ని ధనుంజయ్, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ రాజశేఖర్, గుడ్ల మల్లేశ్వరరావు, కోరాడ రమేష్, గుడ్ల దామోదరరావు, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత నెహ్రూ
దేశ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞానభవన్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం అగ్రగామిగా నిలబడేందుకు నెహ్రూ ఎంతగానో కృషిచేశారన్నారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్‌మోహనరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, కోండ్రు మురళీమోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాల నరసింహమూర్తి, చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు, గంజి ఆర్.ఎజ్రా, తైక్వాండో శ్రీను, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
బాలల హక్కులు పరిరక్షించాలి
బాలల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బంగారు భారతావనికి బాలలే పునాదులన్నారు. పిల్లలను స్వేచ్ఛగా చదువుకోనివ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ బాల్యదశ ఒక స్వర్ణయుగమన్నారు.
బాలల హక్కుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఒక శుభపరిణామమన్నారు. 30 సంవత్సరాలుగా బాలల హక్కులపై పోరాడుతున్న కైలాస్ సత్యార్థికి నోబుల్ బహుమతి లభించడమే ఇందుకు నిదర్శనమన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పిల్లల హక్కులను సంరక్షించి వారి అభివృద్ధికి తగిన స్వేచ్ఛను ఇస్తే జాతి రత్నాలుగా ఎదుగుతారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రభుత్వం కూడా విద్యార్థుల అభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులకు బాల బాలికలు రక్షాబంధన్ కట్టారు.
అనంతరం చైల్డ్‌లైన్ సే దోస్త్ గోడపత్రికను అతిథులు ఆవిష్కరించారు. బడి మానివేసిన 23 మంది పిల్లలకు నెలకు రూ.500చొప్పున మూడు సంవత్సరాల పాటు స్కాలర్‌షిప్ అందేలా ప్రొసీడింగ్స్‌ను అతిథుల చేతులమీదుగా అందించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భార్గవ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ చక్రధరరావు, ఆర్‌వీఎం పీవో ఆర్.గణపతిరావు, అమ్మా ఫౌండేషన్ డెరైక్టర్ ఉత్తమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.