
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
రాష్ట్రంలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఓట్లలెక్కింపు జరగనుంది.
తేలనున్న 102 మంది అభ్యర్థుల భవితవ్యం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఓట్లలెక్కింపు జరగనుంది. ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరిగిన మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతోపాటు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరిగిన కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 102 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. కర్నూలు, నెల్లూరు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే పోటీ పడగా, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతోపాటు మరో ఎనిమిది మంది స్వతంత్రులు కూడా పోటీపడ్డారు.
శ్రీకాకుళం–విజయ నగరం–విశాఖ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 30 మంది పోటీచేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 14 మంది బరిలో నిలిచారు. అనంతపురం–వైఎస్సార్–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో 25 మంది పోటీ పడ్డారు. ప్రకాశం– నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో తొమ్మిది మంది, అనంతపురం–కర్నూలు–వైఎస్సార్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.